చ‌క్రితో త‌మ‌న్నకి మ‌రో ఝ‌ల‌క్‌

Tamannah gets another flop with Chakri Toleti's Khamoshi
Monday, June 17, 2019 - 15:15

పెద్ద టాలెంట్ లేకున్నా కొంద‌రు అవ‌క‌శాలు బాగా పొందుతుంటారు. ఎదుటివాళ్ల‌ని మాట‌ల‌తో ప‌డేస్తారు. ఇది సినిమా రంగంలోనే కాదు దాదాపు అన్ని మీడియా రంగాల్లో ఉంది. అలాంటి లిస్ట్‌లో చ‌క్రి తోలేటి ముందు ఉంటారు. "సాగ‌ర‌సంగమం" సినిమాలో భంగిమ అంటూ బాల‌న‌టుడిగా మెప్పించిన చక్రి తోలేటి పెద్ద పెరిగిన త‌ర్వాత ద‌ర్శ‌కుడు అయ్యాడు. తెలుగులో వెంక‌టేష్‌, క‌మ‌ల్‌హాస‌న్ హీరోలుగా "ఈనాడు" (ఏ వెడ్న‌స్‌డే అనే సినిమాకి రీమేక్‌), త‌మిళంలో అజిత్ హీరోగా "బిల్లా 2" వంటి భారీ అవ‌కాశాలు పొందాడు. ఆ రెండు సినిమాలు చూస్తే చ‌క్రి తోలేటిలో డైర‌క్ష‌న్ టాలెంట్ ఎంత త‌క్కువో తెలిసిపోయింది. రెండూ ఫ్లాప్పే.

ఇలా రెండు ఫ్లాప్‌లు ఇచ్చినా బాలీవుడ్‌లో అవ‌కాశం రావ‌డం విశేషం. సోనాక్షి హీరోయిన్‌గా "వెల్‌క‌మ్ టు న్యూయార్క్" అనే సినిమా తీశాడు. అది మ‌రీ ఘోర‌మైన ఫ్లాప్‌. బాలీవుడ్ క్రిటిక్స్ అంతా ద‌ర్శ‌కుడి క్రియేటివిటీ ఇంత దారుణ‌మా అని విమ‌ర్శించారు.  వ‌న్ రేటింగ్‌కి మంచి ఇవ్వ‌లేదు.

అక్క‌డితో ఆగ‌లేదు ఆయ‌న సినిమా. తాజాగా త‌మ‌న్న‌, ప్ర‌భుదేవా జంట‌గా "ఖామోషీ" అనే మూవీ తీసి గ‌త వీకెండ్ విడుద‌ల చేశాడు. ఈ సినిమాకి సున్నా నుంచి 0.5 మ‌ధ్య రేటింగ్‌లు వ‌చ్చాయి. ఇక థియేట‌ర్ల‌లో ఒక్క టికెట్ తెగ‌లేదు. త‌మ‌న్న ప‌రువు మొత్తం పోయింది. ఎఫ్ 2తో వ‌చ్చిన క్రేజ్ అంతా దీంతో హుష్‌కాకి అన్న‌ది. 

అన్న‌ట్లు చ‌క్రి తోలేటి డైర‌క్ష‌న్‌లో న‌య‌న‌తార కూడా ఒక సినిమా ప‌చ్చ‌జెండా ఊపింద‌ట‌. అస్స‌లు ఈ ద‌ర్శ‌కుడు ఒక్క హిట్ ఇవ్వ‌కుండా హీరోల‌ని, హీరోయిన్ల‌ని, నిర్మాత‌ల‌ని ఎలా ఒప్పిస్తున్నాడ‌నేది కేసు స్ట‌డీ చేస్తే... ఇండ‌స్ట్రీలో టాలెంట్ ఉండి అవ‌కాశాలు లేని వారికి ఉప‌యోగ‌ప‌డుతుందేమో!