తమిళ స్టార్స్ కంటే మనోళ్లే బెటర్

Tamil stars not donating much
Sunday, April 5, 2020 - 15:00

దేశమంతా లాక్ డౌన్. టాలీవుడ్ తో పాటు అన్ని ఇండస్ట్రీస్ నిలిచిపోతాయి. టాలీవుడ్ ను ఆదుకోవడానికి సీనియర్ హీరోలతో పాటు ఇప్పుడిప్పుడే హీరోలుగా ఎదుగుతున్న కార్తికేయ లాంటి హీరోలు సైతం ముందుకొచ్చారు. సినీకార్మికులకు తమకు తోచిన సాయం చేస్తున్నారు. కానీ పొరుగునే ఉన్న కోలీవుడ్ లో మాత్రం పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నంగా ఉంది.

దక్షిణ భారత సినీకార్మికుల సమాఖ్య - ఫెఫ్సీ అనేది ఒకటుంది. అందులో 25వేల మందికి పైగా సభ్యులున్నారు. వాళ్లలో 18వేల మంది సినీకార్మికులే. అంటే షూటింగ్ ఉంటేనే వాళ్లకు డబ్బులు. లేదంటే నరకమే. అలాంటి వాళ్లంతా లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. తమిళ సినీపరిశ్రమ నుంచి స్పందన మాత్రం అంతంతమాత్రంగానే ఉంది.

ఇప్పటివరకు సూర్య, రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్ సేతుపతి, కార్తికేయన్ లాంటి అతికొద్ది మాత్రమే ఫెఫ్సీకి ఆర్థిక సహకారం అందించారు. వీళ్లలో కూడా అత్యధిక మొత్తం ఇచ్చింది రజనీకాంత్ (50 లక్షలు) మాత్రమే. మిగతావాళ్లంతా అరకొర సాయమే. చివరికి యోగిబాబు లాంటి కమెడియన్ కూడా తన స్థాయిలో 25కిలోల బియ్యం బస్తాల్ని ఓ 50 పంపించాడు. తాజాగా నయనతార కూడా 20 లక్షలు ఆర్థిక సాయం చేసింది. వీళ్లు మినహా ఫెఫ్సీకి సహాయం చేసిన వాళ్లు ఎవ్వరూ లేరు.

18వేల మందికి ఈ సహాయం ఏ మూలకూ సరిపోదు.  మొత్తం డబ్బును విభజించి పంచితే.. ఒక్కో కార్మిక కుటుంబానికి 500 రూపాయలు మాత్రమే వస్తోంది. దీనిపై ఫెఫ్సీ అధ్యక్షుడు సెల్వమణి తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికే భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న అజిత్, విజయ్ లాంటి హీరోలు స్పందిస్తే బాగుంటుందేమో.

ఇవన్నీ చూస్తుంటే.. తమిళ స్టార్స్ కంటే తెలుగు హీరోలే చాలా గొప్ప అనిపిస్తుంది. చిరంజీవి, బాలయ్య, వెంకటేశ్, నాగార్జున నుంచి చిన్న హీరోల వరకు అంతా తమకు తోచిన విరాళాలు ఇచ్చారు. సినీకార్మికుల్ని ఆదుకుంటున్నారు.