ఇక్కడ స్విచ్.. అక్కడ ఛాన్స్

Telugu directors getting chances in Bollywood
Friday, July 17, 2020 - 13:15

బాలీవుడ్ సినిమా ఛాన్స్ అంత వీజీనా... కొంతమంది దర్శకుల్ని చూస్తే నిజమేనేమో అనిపిస్తుంది. తెలుగులో కొట్టిన హిట్లే.. నేరుగా వాళ్లను వైల్డ్ కార్డ్ ఎంట్రీలా బాలీవుడ్ లో దించేస్తున్నాయి. అలాఅని వాళ్లు సీనియర్ డైరక్టర్లు కాదు.. జస్ట్ ఒకట్రెండ్ సినిమాలకే బాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటున్నారు.

ఉదాహరణకు శైలేష్ కొలను అనే దర్శకుడ్నే తీసుకుందాం. తెలుగులో ఈయన చేసింది ఒకే ఒక్క సినిమా. అయితేనేం ఆ "హిట్" సినిమాతోనే బాలీవుడ్ ఛాన్స్ కొట్టేశారు. తన సినిమాను తానే హిందీలో రీమేక్ చేయబోతున్నాడు.

అంతెందుకు.. గౌతమ్ తిన్ననూరిది కూడా ఇదే ట్రాక్ రికార్డ్ కదా. "జెర్సీ" కంటే ముందు ఆయన చేసింది ఒకే ఒక్క సినిమా. "జెర్సీ" హిట్ తో ఇప్పుడా సినిమాను హిందీలో రీమేక్ చేసే బాధ్యతను కూడా ఇతడే దక్కించుకున్నాడు.

రితేష్ రానా పేరు కూడా ఇప్పుడీ లిస్ట్ లోకి చేరిపోయింది. తను తీసిన "మత్తు వదలరా" అనే సినిమాను హిందీలో కూడా ఇతడే రీమేక్ చేయబోతున్నాడు. ఇలా ఒకట్రెండు సినిమాలకే మన దర్శకులు ఏకంగా బాలీవుడ్ ఆఫర్లు దక్కించుకుంటున్నారు. 

ఒకప్పుడు ఇక్కడ హిట్ అయిన సినిమాను అక్కడి దర్శకులతో రీమేక్ చేసుకునే వాళ్లు. కానీ ఇప్పుడు ఒరిజినల్ దర్శకులకే నేరుగా ఆఫర్లు ఇస్తున్నారు. పైగా వీటిని నిర్మిస్తోంది కూడా తెలుగు నిర్మాతలే కావడంతో వీళ్లకు ఆటోమేటిగ్గా అవకాశాలు వస్తున్నాయి.

వీళ్లందరికీ స్ఫూర్తినిచ్చిన దర్శకుడు మాత్రం కచ్చితంగా సందీప్ రెడ్డి వంగానే. ఇటు అర్జున్ రెడ్డితో అటు కబీర్ సింగ్ తో ఇతడు సృష్టించిన సంచలనం చిన్నదేం కాదు.