ఈటీవీ, మా, జీ, జెమినీ.... తలో దారి

Telugu Entertainment channels
Tuesday, April 7, 2020 - 12:00

ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎంటర్ టైన్ మెంట్స్ ఛానెల్స్ కలలో కూడా ఊహించి ఉండవు. న్యూస్ ఛానెల్స్ అయితే పండగ చేసుకుంటున్నాయి కానీ, ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్స్ (GEC) మాత్రం రెవెన్యూ తగ్గిపోయి బిక్కుబిక్కుమంటున్నాయి. పైగా షూటింగ్స్ కూడా లేకపోవడంతో ఏం ప్రసారం చేయాలో అర్థంకాక ఒక్కో ఛానెల్ ఒక్కో దారి వెదుక్కున్నాయి.

అందరూ ఊహించినట్టుగానే ఈటీవీ ఛానెల్.. పాత జబర్దస్త్ కార్యక్రమాల్ని బయటకు తీసింది. నాగబాబు ఈ కార్యక్రమాన్ని వీడి వెళ్లినప్పటికీ, అతడు ఉన్న పాత ప్రొగ్రామ్స్ ను రిపీట్ చేస్తోంది. మరీ ముఖ్యంగా హైపర్ ఆది ఎక్కువగా ఉన్నట్టు కార్యక్రమాల్ని డిజైన్ చేసి మరీ రిపీట్ వేస్తోంది. వీటికి తోడు తన ఫ్లాగ్ షిప్ కార్యక్రమం స్వరాభిషేకాన్ని కూడా బయటకుతీసింది. రకరకాల కాంబినేషన్లను సెట్ చేస్తూ.. అటుఇటు మారుస్తూ.. పాత ఎపిసోడ్లకే కొత్త కలరింగ్ ఇచ్చి టెలికాస్ట్ చేస్తోంది. దీనికి తోడు తనకు మంచి బలం, పట్టు ఉన్న న్యూస్ ను ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ లో కొత్తగా పెట్టింది. ఉదయం 7 గంటలకు, రాత్రి 9 గంటలకు వచ్చే వార్తలకు అదనంగా.. మధ్యాహ్నం 4 గంటలకు కూడా ఓ స్లాట్ పెట్టింది.

ఈటీవీ ప్లానింగ్ ఇలా ఉంటే జీ తెలుగు మాత్రం ఏవి ప్రసారం చేయాలో అర్థంకాక కిందామీద పడుతోంది. ఎందుకంటే ఈటీవీ లానే జీ తెలుగు వద్ద కూడా పెద్దగా సినిమా కంటెంట్ లేదు. దీంతో సరిగమప లాంటి షోజ్ తో పాటు డాన్స్ కార్యక్రమాలు, జీ సినీఅవార్డులు, జీ కుటుంబం అవార్డుల్ని మళ్లీ మళ్లీ రిపీట్ చేస్తోంది. వీటితో పాటు ఉన్నంతలో తన దగ్గరున్న సినిమాల్ని తిప్పితిప్పి వాటినే ప్రసారం చేస్తోంది.

అటు స్టార్ మా పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఇప్పటికే పాత సీరియల్స్, కార్యక్రమాల్ని రిపీట్ చేస్తున్న ఈ ఛానెల్.. తన దగ్గరున్న సూపర్ హిట్ సినిమాల్ని పూర్తిగా స్టార్ మా కే పరిమితం చేసింది. మా మూవీస్ ను పాత సినిమాలకే పరిమితం చేసింది. మా మ్యూజిక్ సంగతి అందరికీ తెలిసిందే. కరోనా ఉన్నా లేకపోయినా అందులో పాటలు మారవు.

ఈ మొత్తం వ్యవహారంలో కాస్త పటిష్టంగా కనిపిస్తున్న ఛానెల్ జెమినీ మాత్రం. తన దగ్గరున్న రిచ్ కంటెంట్ ను రిపీట్ లో పెట్టింది జెమినీ. రకరకాల టాక్ షోలను తిరిగి లాంఛ్ చేసింది. కొన్ని నాన్-ఫిక్షన్ కార్యక్రమాల్ని కూడా రిపీట్ పెట్టింది. దీనికి తోడు జెమినీ వద్ద ఉన్న వందలాది సినిమా టైటిళ్లు ఆ ఛానెల్ కు బలంగా మారింది.

ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా అంతా ఇళ్లలకే పరిమితమయ్యారు కాబట్టి రిపీట్ వేసిన ఛానెల్స్ కు ఇప్పటికిప్పుడు వచ్చిన ఇబ్బందేం లేదు. కాకపోతే రెవెన్యూ లేకపోవడం ఈ ఛానెల్స్ అన్నింటినీ డైలమాలో పడేశాయి. కరోనా ఎఫెక్ట్ తగ్గిన తర్వాత ఈ ఛానెల్స్ లో కాస్ట్ కటింగ్ ఖాయంగా కనిపిస్తోంది