దేవిశ్రీప్రసాద్ తో ఎలాంటి పోటీ లేదు

Thaman says no competition with any music director
Tuesday, December 3, 2019 - 18:30

తమన్ కంపోజ్ చేసిన అల వైకుంఠపురములో సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. సో.. దీనికి పోటీగా వస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలోని పాటలు ఎలా ఉంటాయా అంటూ అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేసిన మైండ్ బ్లాక్ పాట ఆకట్టుకోలేకపోయింది. సరిగ్గా ఇదే టైమ్ లో తమన్ ప్రెస్ మీట్ పెట్టడంతో, అంతా ఈ విషయాన్ని తమన్ వద్ద ప్రస్తావించారు.

అయితే తన ఇంటర్వ్యూలో తమన్ ఎక్కడా దేవిశ్రీ పేరు ప్రస్తావించలేదు. సరిలేరు నీకెవ్వరు సినిమా పేరు కూడా ఉచ్ఛరించలేదు. కేవలం తను నంబర్ గేమ్ ను నమ్మనని మాత్రమే అన్నాడు. ఇప్పుడు పోటీగా ఫీలైతే, తెల్లారేసరికి అదే మ్యూజిక్ డైరక్టర్ ముఖం చూడాల్సి వస్తుందని, అది తనకు ఇబ్బందిగా ఉంటుందని అన్నాడు తమన్.

"తమన్ ట్రెండ్ అనేది నేను నమ్మను. నంబర్-1 గేమ్ ను అస్సలు నమ్మను. పాట బాగుంటే వింటారు, లేదంటే లేదు. మరో సంగీత దర్శకుడితో పోటీ అనేది ప్రేక్షకుడి పాయింట్ ఆఫ్ వ్యూ. మా మధ్య అలాంటి కాంపిటిషన్ అనేది ఎప్పుడూ ఉండదు. మా సినిమాలు మేం చేసుకుంటూ పోతాం. మా అందరికీ ఓ వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. అలాంటప్పుడు పోటీ అనేది ఎందుకుంటుంది. పైగా హైదరాబాద్ టు చెన్నై తిరిగేటప్పుడు ఫ్లయిట్ లో ఎవరో  ఒక మ్యూజిక్ డైరక్టర్ ఎదురవుతాడు. తప్పించుకోలేం కదా, మాట్లాడాల్సిందే. కాబట్టి పోటీని నమ్మను."

పైకి చెప్పకపోయినా ప్రస్తుతం ఉన్న పొజిషన్ ను తమన్ బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు. తన కెరీర్ లోనే ఇది పీక్ స్టేజ్ అంటున్న తమన్.. ఈ సందర్భంగా తన దర్శకులు, హీరోలు, నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పాడు. పీక్ లో ఉన్నాను కాబట్టి పారితోషికం పెంచమని అడగనని, తన వర్క్ చూసి వాళ్లే పెంచుతారని అంటున్నాడు ఈ స్టార్ కంపోజర్.