తమన్ క్వారంటైన్ ఇంటర్వ్యూ

Thaman talks about Vakeel Saab and more
Thursday, May 7, 2020 - 16:30

సరిగ్గా లాక్ డౌన్ స్టార్టయ్యే టైమ్ కు చెన్నైలోని తన ఇంటికి చేరుకున్నాడు తమన్. ఇక అక్కడే ఉండిపోయాడు. సరైన టైమ్ కు ఇంటికి చేరిపోవడం చాలా హ్యాపీగా ఉందంటున్నాడు. ఈ లాక్ డౌన్ లో తమన్ ఏం చేస్తున్నాడు.. అతడి మూవీ అప్ డేట్స్ ఏంటి?

1. క్వారంటైన్ డే ఎలా గడుస్తోంది?
వకీల్ సాబ్ కంపోజిషన్ పూర్తిచేసి మార్చి 17న హైదరాబాద్ నుంచి చెన్నై వచ్చాను. అప్పట్నుంచి ఇంట్లోనే అన్నీ. పొద్దున్నే అపార్ట్ మెంట్ పైకి వెళ్లిపోతాను. పైన నెట్ ఉంది. నా స్టుడియో కూడా అక్కడే ఉంది. కాసేపు క్రికెట్ ఆడతాం. తర్వాత బ్రేక్ ఫాస్ట్. టిఫిన్ చేసిన తర్వాత సినిమా. లంచ్ చేసిన తర్వాత మళ్లీ ఇంకో సినిమా. సాయంత్రం మళ్లీ క్రికెట్. ఇలా గడిచిపోతోంది.

2. ఇంత బిజీగా ఉన్న మీరు ఫ్రీ అయిపోయారు. బోర్ కొట్టడం లేదా?
మా అపార్ట్ మెంట్లోనే నాకు స్టుడియో ఉంది. మొదటి అంతస్తులో ఇల్లు. ఏడో అంతస్తులో స్టుడియో. మ్యాగ్జిమమ్ అక్కడే ఉంటాను. వీడియో గేమ్స్ అయినా, కంపోజిషన్స్ అయినా అన్నీ అక్కడే. పోస్ట్ ప్రొడక్షన్ లో 4 సినిమాలున్నాయి. వాటికి సంబంధించి ఫైనల్ టచెస్ ఇస్తున్నాను. ప్రొఫెషనల్ గా నేను ఎప్పుడూ స్టుడియోలో 4 గోడల మధ్యే ఉంటాను. కాబట్టి ఈ క్వారంటైన్ నాకు కొత్తగా అనిపించడం లేదు. పైగా ఇంట్లో అమ్మతో ఉన్నాను కాబట్టి ఆ ఫీలింగ్ లేదు

3. మీ పాటలకు ఇన్సిపిరేషన్ ఏంటి?
నా వరకు పాటలు బాగా రావాలంటే స్క్రిప్ట్ ఇంపార్టెంట్. మంచి స్క్రిప్ట్ ఉంటే మంచి పాటలు వస్తాయి. ఆ సిచ్యువేషన్ లేకపోతే "ఓ మై గాడ్ డాడీ" అనే పాట వచ్చేది కాదు. సినిమాలో హీరో కాళ్లను చూసి ఎక్సయిట్ అవ్వకపోతే సామజవరగమన సాంగ్ రాదు. కాబట్టి నేను స్క్రిప్ట్ ను నమ్ముతాను. స్క్రిప్ట్ ఎంత బలంగా ఉంటే పాట అంత హిట్ అవుతుంది. నా క్రెడిట్ కాదు, అందరం కలవడం వల్ల ఆ అవుట్ పుట్ వచ్చింది.

4. త్రివిక్రమ్ తో వర్క్ ఎలా ఉంటుంది?
త్రివిక్రమ్ తో ఎప్పుడు కూర్చున్నా చాలా బాగుంటుంది. ప్రతి సిట్టింగ్ ఓ బ్యూటిఫుల్ డే అనిపిస్తుంది. అలా అని ఆయన ఎక్కువ సేపు గడపరు. చాలా కొద్ది టైమ్ మాత్రమే సిట్టింగ్ ఉంటుంది. ఆ టైమ్ లోనే బెస్ట్ వచ్చేస్తుంది. ఆయన వెళ్లిపోగానే, మళ్లీ ఎప్పుడొస్తారా అనిపిస్తుంది. ఆయనతో ఏరోజైనా నాకు అలానే ఉంటుంది. లెక్కప్రకారం ఈపాటికి త్రివిక్రమ్ తో మ్యూజిక్ సిట్టింగ్స్ లో కూర్చోవాలి. లాక్ డౌన్ తర్వాత ప్లాన్ చేయాలి.

5. వకీల్ సాబ్ గురించి?
నా దృష్టిలో వకీల్ సాబ్ చాలా బరువైన సినిమా. ఆ స్క్రిప్ట్ లోనే ఆ బరువు ఉంది. ఇక పవన్ కల్యాణ్ ఇమేజ్ అనేది ఇంకా పెద్ద బరువు. దీనికి తోడు నేను స్వతహాగా పవన్ సర్ ఫ్యాన్ ని. కాబట్టి ఎక్కడా ఆ హీరోయిజం తగ్గకూడదు. స్క్రిప్ట్ కు న్యాయం జరగాలి. వకీల్ సాబ్ కు సంబంధించి ఏ సాంగ్ రిలీజైనా అదొక మార్క్ అవ్వాలి. ఇదే దృష్టిలో పెట్టుకొని పనిచేస్తున్నాను.

6. దేవిశ్రీప్రసాద్ తో పోటీ ఫీల్ అవుతున్నారా?
దేవిశ్రీ ప్రసాద్ తో నాకు ఎప్పుడూ పోటీ ఉంటుంది. పోటీ అనేది ఉండాలి. కాంపిటిషన్ లేనప్పుడు బతికి వేస్ట్. మేం మంచి ఫ్రెండ్స్. కానీ వర్క్ లో మాత్రం ఎప్పుడూ పోటీ ఉంటుంది. వ్యక్తిగతంగా మాత్రం మా మధ్య ఎలాంటి పోటీ లేదు. టైమ్ దొరికినప్పుడల్లా మేం కలుస్తుంటాం, మాట్లాడుకుంటాం.