ఈ క్రిస్మస్ కు ఫ్లాపు సినిమాలివే

Three major flops during Christmas 2019
Tuesday, January 7, 2020 - 10:00

ప్రతి సంక్రాంతికి హిట్స్ ఉంటాయి, ఫ్లాప్స్ ఉంటాయి. అలాగే ప్రతి క్రిస్మస్ కు కొన్ని సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అందులో కొన్ని క్లిక్ అయితే, మరికొన్ని ఫ్లాప్స్ అవుతాయి. ఈసారి క్రిస్మస్ బరిలో బాలయ్య నటించిన రూలర్ సినిమా డిజాస్టర్ అవ్వగా, సేమ్ టైమ్ రిలీజైన ప్రతి రోజూ పండగే సూపర్ హిట్ అయింది. సాయితేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇంకా వసూళ్లు సాధిస్తోంది కూడా.

ఇక మిగతా భాషల్లో కూడా క్రిస్మస్ డిజాస్టర్లు ఉన్నాయి. ఈ లిస్ట్ లో ముందుగా చెప్పుకోవాల్సింది మామాంగం సినిమా గురించే. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 12న కేరళలో విడుదలైన ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. విడుదలైన మొదటి రోజు క్రిటిక్స్ అంతా ఈ సినిమాను ఆకాశానికెత్తేశారు. మమ్ముట్టి, ఉన్ని ముకుందన్ సూపర్ అన్నారు. కట్ చేస్తే, మూడో రోజు నుంచే సినిమాకు వసూళ్లు పడిపోవడం ప్రారంభమయ్యాయి. అలా క్రిస్మస్ నాటికి పూర్తిగా ఫ్లాట్ అయింది మూవీ. ఇటు తెలుగులో ఈ సినిమా ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. అల్లు అరవింద్ లాంటి వ్యక్తి రంగంలోకి దిగి ప్రచారం చేసి, సొంతంగా రిలీజ్ చేసినప్పటికీ ఫలితం శూన్యం.

ఇక కోలీవుడ్ లో హీరో సినిమా కూడా భారీ అంచనాల మధ్య వచ్చి ఫ్లాప్ అయింది. శివ కార్తికేయన్ హీరోగా నటించిన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న విడుదలైంది. శివకార్తికేయన్, కల్యాణి ప్రియదర్శన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు కూడా మీడియా భారీగా హైప్ ఇచ్చింది. కొన్ని తమిళ వెబ్ సైట్స్ అయితే 5కి 3.5 రేటింగ్స్ కూడా ఇచ్చాయి. కానీ ఈసారి దర్శకుడు మిత్రన్ ఆకట్టుకోలేకపోయాడు. ఊహించే సన్నివేశాలు, ట్విస్టుల కారణంగా ఈ సినిమా తేలిపోయింది.

అలా ఈ క్రిస్మస్ కు తెలుగులో రూలర్, తమిళ్ లో హీరో, మలయాళంలో మామాంగం సినిమాలు ఫ్లాపులుగా నిలిచాయి.