సేమ్ టైటిల్.. హీరో మారిపోతున్నాడు

Titles swap for stars
Thursday, January 30, 2020 - 13:15

ఒక హీరో కోసం అనుకున్న కథ మరో హీరోకు చేరడం కొత్తకాదు. ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలం నుంచి ఇప్పటి అఖిల్ జమానా వరకు ఇది చూస్తూనే ఉన్నాం. కాకపోతే ఇప్పుడు కథలు మాత్రమే కాదు, టైటిల్స్ కూడా స్వైప్ అయిపోతున్నాయి. ఒకరి కోసం అనుకున్న టైటిల్ మరొకరి చేతిలోకి వెళ్లిపోతోంది. రీసెంట్ గా అలాంటి 2 టైటిల్స్ హాట్ టాపిక్ గా మారాయి.

జాన్.. ఈ టైటిల్ చెప్పగానే ఎవరికైనా ప్రభాస్ సినిమానే గుర్తొస్తుంది. సినిమా లాంఛ్ అయినప్పట్నుంచి ఇదే పేరు వినిపించింది. కొంతమంది అసలైన టైటిల్ అన్నారు, మరికొందరు వర్కింగ్ టైటిల్ అన్నారు.  ఏదైతేనేం... అదంతా ప్రభాస్ సినిమాకు సంబంధించిన వ్యవహారం అనుకున్నారు. కట్ చేస్తే, ఆ టైటిల్ శర్వానంద్ కు వెళ్లిపోయింది. తమిళ్ లో హిట్టయిన 96సినిమాకు రీమేక్ గా తెలుగులో తెరకెక్కిన సినిమాకు జాను అనే టైటిల్ ఫిక్స్ చేయడం, రిలీజ్ కు రెడీ అవ్వడం అన్నీ చకచకా జరిగిపోయాయి. ప్రస్తుతం ప్రభాస్ మరో టైటిల్ వెదికే పనిలో బడ్డాడు.

ఇలాంటిదే మరో టైటిల్ సీటీమార్. హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా రావాల్సిన సినిమాకు ఈ టైటిల్ అనుకున్నారు. కానీ ఆ సినిమా రాలేదు. దీంతో ఈ టైటిల్ చేతులు మారింది. సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ చేస్తున్న సినిమాకు సీటీమార్ అనే టైటిల్ పెట్టేశారు. ఇలా ఈమధ్య కాలంలో 2 టైటిల్స్ అటుఇటు మారిపోయాయి.