కరోనా టైంలో నంది ప్రస్తావన!

Tollywood asks about Nandi awards during this corona crisis
Tuesday, June 9, 2020 - 17:00

ఇంకో మూడు నాలుగు నెలలు కరోనా ఉధృతి కొనసాగడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది. అందుకే సినిమా థియేటర్లకు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే అనుమతి ఇవ్వలేమని చెప్పింది. ఇంకో వైపు పబ్లిక్ ఫంక్షన్లు, పెద్ద ఎత్తున మీటింగ్స్ కి మరో ఆర్నెల్ల పాటు అనుమతి ఇవ్వొద్దు అని ఆరోగ్యవేత్తలు చెప్తుంటే... నంది అవార్డుల కార్యక్రమం నిర్వహిస్తే బాగుంటుంది అని తెలుగు సినిమా పెద్దలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ని అడగడడం నవ్వులపాలు అయింది. 

సోమవారం మెగాస్టార్ చిరంజీవి, రాజమౌళి, నాగార్జున, దిల్ రాజు, సురేష్ బాబు, సి కళ్యాణ్, దాము, పీవీపీ, తదితరులు సీఎం జగన్ ని ఆయన నివాసంలో కలిశారు. ఆంధ్ర ప్రదేశ్ లోనూ షూటింగులకు త్వరలోనే అనుమతి ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. అనేక వినతులు చేసింది చిత్రసీమ. వాటి అన్నింటికీ సీఎం సానుకూలంగా స్పందించారు. ఐతే ఈ టైంలో నంది అవార్డుల కార్యక్రమం గురించి ప్రస్తావించడం కామెంట్స్ కి గురి అయింది. త్వరలోనే వీటిని నిర్వహిస్తామని జగన్ చెప్పినట్లు చిరంజీవి మీడియాకి తెలిపారు.

 "మీ సినిమాల విడుదలనే నెక్స్ట్ ఇయర్ కి వాయిదా వేసుకుంటూ ... ఇప్పుడు నంది అవార్డుల ఈవెంట్ గురించి మాట్లాడటం ఏంటి," అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పడుతున్నాయి.