గేమ్ ఆడుతున్న హీరోస్

Tollywood stars and sports dramas
Friday, July 31, 2020 - 15:45

ఒకప్పుడు హీరోలంతా గంపగుత్తగా లవ్ స్టోరీల వెంట పడ్డారు. కొన్నాళ్లకు అదే హీరోలు వరుసపెట్టి ఫ్యామిలీ స్టోరీలు కూడా చేశారు. ఇప్పుడు హీరోల దృష్టి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ పై పడింది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఒకేసారి 4-5 స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమాలు తెరకెక్కుతున్నాయి.

రీసెంట్ గా నాగశౌర్య తన కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు. ఇంకా పేరుపెట్టని ఈ సినిమాతో అతడు ఏకంగా ఆర్చర్ (విలుకాడు) అవతారం ఎత్తాడు. విలువిద్య నేపథ్యంలో, సంతోష్ జాగర్లపూడి డైరక్షన్ లో ఈ సినిమా రాబోతోంది.

అటు హీరోలు విజయ్ దేవరకొండ, వరుణ్ తేజ్ ఒకేసారి ఒకే రకమైన కాన్సెప్టులు సెలక్ట్ చేసుకున్నారు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో చేస్తున్న కొత్త సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించబోతున్నాడు. అటు వరుణ్ తేజ్ కూడా తన కొత్త సినిమాలో బాక్సర్ గా కనిపిస్తున్నాడు. వీళ్లు చేస్తున్న సినిమాల కథలు డిఫరెంట్ కావొచ్చు కానీ వీళ్ల పాత్రలు మాత్రం దాదాపు ఒకటే.

ఇక గోపీచంద్ కూడా ఎన్నడూలేని విధంగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సెలక్ట్ చేసుకున్నాడు. సంపత్ నంది దర్శకత్వంలో "సీటీమార్" అనే సినిమా చేస్తున్నాడు. కబడ్డీ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో గోపీచంద్ ఆంధ్రా కబడ్డీ కోచ్ గా కనిపించబోతున్నాడు.

వీళ్లతో పాటు ఆది పినిశెట్టి కూడా ఓ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమా చేస్తున్నాడు. మరోవైపు వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరి క్రీడా జీవితం ఆధారంగా కూడా ఓ సినిమా రాబోతోంది.