త్రివిక్ర‌మ్ మొద‌టిసారి రీమేక్ చేస్తాడా?

Trivikram in dilemma about remake
Saturday, October 27, 2018 - 11:00

త్రివిక్ర‌మ్ - అల్లు అర్జున్ కాంబినేష‌న్లో మూడో సినిమా క‌న్‌ఫ‌మ్ అయింద‌నేది పాత వార్తే. ఐతే ఈ సినిమా ప‌ట్టాలెక్కేందుకు ఇంకా చాలా అడ్డంకులున్నాయి. బాలీవుడ్‌లో సూప‌ర్‌హిట్ట‌యిన "సోనూకే టిటుకి స్వీటీ "(Sonu Ke Titu Ki Sweety) అనే సినిమాని రీమేక్ చేయాల‌నేది అల్లు అర్జున్ పెట్టిన ప్ర‌పోజ‌ల్‌. మొద‌ట త్రివిక్ర‌మ్ ఈ ఐడియాపై మొగ్గు చూపినా.. ఇపుడు ఆలోచ‌న‌లో ప‌డ్డాడ‌ట‌. 

ఆ సినిమాని బ‌న్నితో రీమేక్ చేయ‌బోతున్నార‌ని ఉప్పందంగానే బాలీవుడ్ నిర్మాణ సంస్థ ..రీమేక్ హ‌క్కుల‌కి మ‌నీ వ‌ద్దు..నిర్మాణంలో భాగ‌స్వామ్యం కావాలని పేచీ పెట్టింద‌ట‌. టిసిరీస్‌కి ప్రొడ‌క్ష‌న్‌లో వాటా ఇస్తే.. మ‌రి గీతా ఆర్ట్స్‌కి ఎంత వాటా ఉంటుంది, శానం నాగ ఆశోక్ కుమార్‌కి ఎంత ఇవ్వాలి? ఈ కాంబినేష‌న్‌లో హారిక హాసిని దూరుతుందా? ఇలాంటి లెక్క‌లెన్నో ఉన్నాయి. అవి సెట్ కావ‌డానికి టైమ్ ప‌ట్టేలా ఉంది.

మ‌రో స‌మ‌స్య ఏంటంటే... త్రివిక్ర‌మ్ రీమేక్ చేయ‌డం అవ‌స‌ర‌మా? తెలుగు సినిమా రంగంలోనే ఆల్‌టైమ్ గ్రేట్ రైట‌ర్‌ల‌లో ఒక‌రిగా పేరు తెచ్చుకున్నారు త్రివిక్ర‌మ్‌. ఆయ‌న రైటింగ్‌కి ల‌క్ష‌లాది అభిమానులున్నారు. అలాంటి గొప్ప రైట‌ర్ ఇపుడు రీమేక్ చేస్తే... ఆయ‌న రైట‌ర్‌గా స్థాయి త‌గ్గించుకున్న‌ట్లు అవుతుందా అన్న డైల‌మా కూడా ఉంద‌ట‌. అందుకే త్రివిక్ర‌మ్ ఇంకా దీనికి ఓకే చెప్ప‌లేదు. ఇదంతా తేలాలి అంటే మ‌రో వారం టైమ్ ప‌డుతుంది.