నేనూ వస్తాను.. నేనే వస్తాను

Trivikram talks about Atadu famous dialogue
Friday, January 17, 2020 - 17:00

నేనూ వస్తాను అంటుంది త్రిష. నేనే వస్తాను అంటాడు మహేష్ బాబు. సింపుల్ గా రాసిన ఈ రెండు డైలాగ్స్ సూపర్ హిట్టయ్యాయి. త్రివిక్రమ్ రైటింగ్ స్టయిల్ సూపర్ అన్నారంతా. అప్పటి ఆ డైలాగ్ జ్ఞాపకాన్ని మరోసారి గుర్తుచేసుకున్నాడు త్రివిక్రమ్. నిజానికి అది తప్పనిసరి పరిస్థితుల మధ్య రాయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు.

"అతడు సినిమాలో ఆ సీక్వెన్స్ 3 రోజులు తీశాను. ఆరోజు రాత్రి ఒంటి గంట అయింది. అలాంటి టైమ్ లో నేను ట్రాలీ పెట్టమన్నాను. పైగా జూమ్ ఒకటి. దీంతో గిరిబాబు, బ్రహ్మానందం నా మీద జోకులేస్తున్నారు. మహేష్ తాతగారితో మాట్లాడే సీన్ తీసేసరికి రాత్రి 2 అయింది. అప్పుడు మహేష్-త్రిష మధ్య సీన్ తీయాలి. అప్పటికే అంతా అలసిపోయారు. అప్పుడు ఆ సీన్ తీయడం చాలా కష్టం. మహేష్-త్రిష మధ్య 2 పేజీల డైలాగ్ అది. అసలే త్రిషకు తెలుగు రాదు. మిగతా నటీనటులంతా నన్ను కొట్టేలా చూస్తున్నారు. దీంతో ఆ 2 పేజీల సీన్ చించేసి, కేవలం 2 డైలాగ్స్ రాశాను. సింగిల్ షాట్."

అలా ఆ డైలాగ్ పుట్టిన విషయాన్ని చెప్పుకొచ్చాడు త్రివిక్రమ్. ఒక్కోసారి మనం ఎంత మనసు పెట్టి రాసుకున్నా, పరిస్థితులు అనుకూలించనప్పుడు అందుకు తగ్గట్టుగా మారాల్సి ఉంటుందని, అతడు సినిమా టైమ్ లో జరిగిన ఆ ఘటన తనకు ఓ మంచి జ్ఞాపకం అంటున్నాడు త్రివిక్రమ్.