ఈవారం బుల్లితెర టాప్-5 ఇవే

TV ratings of Telugu movies - April 2
Thursday, April 2, 2020 - 14:45

గతవారం స్తబ్దుగా మారిన బుల్లితెర ఈవారం మాత్రం కాస్త బాగానే హంగామా చేసింది. దీనికి కారణం ఒకే వారంలో రెండు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్స్ పడడం, వాటికి మంచి రేటింగ్స్ రావడం కూడా. ఉగాది ఫ్లేవర్ యాడ్ అవ్వడం, లాక్ డౌన్ కారణంగా అంతా ఇళ్లల్లో ఉండడం కూడా ఈసారి ఛానెళ్లకు బాగా కలిసొచ్చింది. బుల్లితెరపై మెరిసిన టాప్-5 మూవీస్ చూద్దాం

ఉగాది కానుకగా జెమినీ టీవీలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం చేసిన సరిలేరు నీకెవ్వరు సినిమా టీఆర్పీల్లో సరికొత్త రికార్డులు సృష్టించింది. అర్బన్ లో ఈ సినిమాకు ఏకంగా 23.35 టీఆర్పీ (ఏపీ+తెలంగాణ) రావడం విశేషం.

బార్క్ అమల్లోకి వచ్చిన తర్వాత ఓ తెలుగు సినిమాకు ఈ స్థాయి రేటింగ్ రావడం ఇదే ఫస్ట్ టైమ్. అంతేకాదు.. ఈ సినిమా రేటింగ్స్ లో బాహుబలి-2ను కూడా క్రాస్ చేసింది. బాహుబలి-2కు 22.7 టీఆర్పీ వచ్చింది. సిల్వర్ స్క్రీన్ పై బాహుబలి-2ను క్రాస్ చేయలేకపోయిన మహేష్ సినిమా.. ఇలా స్మాల్ స్క్రీన్ పై బాహుబలిని క్రాస్ చేసిందన్న మాట.

ఇక సాయితేజ్ నటించిన ప్రతి రోజూ పండగే సినిమాకు కూడా మంచి రేటింగ్ వచ్చింది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ఆదివారం (22వ తేదీ) సాయంత్రం ప్రైమ్ టైమ్ లో వేసిన ఈ సినిమాకు 15.13 (అర్బన్) టీఆర్పీ వచ్చింది. అదే టైమ్ లో జెమినీలో వేసిన రాక్షసుడు రిపీట్ కు 5, బాహుబలి-2కు 4.84, ఇస్మార్ట్ శంకర్ కు 4.04 టీఆర్పీ వచ్చింది. ఇలా ఈ 5 సినిమాలు ఈ వారం టీవీ రేటింగ్స్ లో టాప్-5లో నిలిచాయి.