ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కి పెద్ద ఫ్యాన్‌ని: ఉదయ్‌ శంకర్‌

Uday Shankar says he's big fan of Pawan Kalyan
Wednesday, December 4, 2019 - 17:45

మిస్ మ్యాచ్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరిస్తున్నారు యువ హీరో ఉదయ్ శంకర్. ఈ నెల 6న థియేటర్లలోకి వస్తోంది ఈ మూవీ. 
మీడియాతో ఉదయ్ శంకర్ ముచ్చట్లు... 

మీ గురించి చెప్పండి?
మా అమ్మగారిది మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని జడ్చర్ల గ్రామం. నాన్నగారిది గద్వాల దగ్గరున్న మల్దకల్‌. నా స్కూలింగ్‌ అంతా నిజామాబాద్‌లో గడిచింది. ప‌ద‌వ త‌ర‌గతి వ‌ర‌కు అక్క‌డే చ‌దువుకున్నాను. గుంటూరు వికాస్‌ కాలేజీలో ఇంటర్మీడియెట్‌ చదివాను. తర్వాత అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ నుంచి ఎంఏ సోషియాలజీ చేశాను. నాకు ముందు నుండి న‌ట‌న అంటే చాలా ఆస‌క్తి. అందుక‌నే నేను బీడీఎస్‌లో రెండేళ్లు చ‌దివి మానేశాను. నాన్న ఇంగ్లీష్‌ లెక్చరర్‌గా రిటైర్‌ అయ్యారు. ఫిలాసఫీపై చాలా పుస్తకాలు రాశారు. వాటి ద్వారానే సినీ రాజకీయ ప్రముఖులతో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది

'ఆటగదరా శివ' మూవీలో అవకాశం ఎలా వచ్చింది?
హైస్కూల్లో చదివేటప్పుడే 'చిరుజల్లు' సినిమాలో నటించాను. పెద్దయ్యాక మొదట దాసరి నారాయణ రావుగారి 'యంగ్‌ ఇండియా' సినిమాలో ఒక చిన్న రోల్‌ చేశాను. అలాగే 'లింగ, 'పవర్‌' సినిమాల్లో చిన్న సీన్లు చేశాను. ఆ రెండింటికీ రాక్‌లైన్‌ వెంకటేశ్‌గారు నిర్మాత. ఐదేళ్లు ఆయనతో ట్రావెల్‌ చేశాను. నేను బాగా చేస్తున్నాననే నమ్మకం కలిగి, చంద్రసిద్ధార్ద్‌ డైరెక్షన్‌లో ఆయన 'ఆటగదరా శివ' తీశారు.

'మిస్‌ మ్యాచ్‌' ప్రాజెక్ట్‌ ఎలా స్టార్ట్‌ అయ్యింది?
- ఒక లవ్‌ స్టోరీ చేద్దామనీ, అది రెగ్యులర్‌ లవ్‌ స్టోరీలా కాకుండా కంటెంట్‌ ప్రధానంగా ఉండాలని అనుకున్నాం. ఆ ప్రాసెస్‌లో చాలా కథలు విన్నాం. ఆ టైం లోనే ఒకసారి సీనియర్‌ రైటర్‌ భూపతిరాజా గారు  మా ఆఫీసుకు వచ్చి ఈ 'మిస్‌ మ్యాచ్‌` లైన్ చెప్పారు. బాగా న‌చ్చింది. త‌ర్వాత క‌థ డెవ‌ల‌ప్ చేశారు.  ఫ్యామిలీ డ్రామా, యూత్‌ఫుల్‌ లవ్‌ స్టోరీ. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ అన్నీ ఉన్నాయి. నేను సిద్ధు అనే ఐటీ ఉద్యోగిగా నటిస్తే, కనక మహాలక్ష్మి అలియాస్‌ మహా అనే రెజ్లర్‌గా ఐశ్వర్య రాజేశ్‌ చేసింది.

ఐశ్వర్యా రాజేశ్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం?
ఇది యాక్ట‌ర్‌గా నాకు రెండో సినిమానే, ఐశ్వ‌ర్య‌గారు ఇప్ప‌టికే పాతిక సినిమాలు పైగా చేశారు. ఎలాగా అనుకున్నాను. అయితే నా పాత్ర ప‌రంగా నేను న్యాయం చేయాల‌ని క‌ష్ట‌ప‌డ్డాను. ఐశ్వ‌ర్య‌గారి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆమె నేషనల్‌ అవార్డ్‌ విన్నర్‌, తమిళంలో స్టార్‌ అయిన ఐశ్వర్యా రాజేశ్‌ మంచి పెర్ఫార్మర్‌. నటన విషయంలో ఆమెతో నేను మిస్‌ మ్యాచ్‌ కాకూడదు. ఫస్ట్‌ టైం నాలో నెర్వస్‌నెస్‌ తను గమనించి, ''టెన్షన్‌ పడకు. ఒక ఫ్రెండ్‌ అనుకొని చెయ్యి'' అని చెప్పింది. దాంతో నా ఫోకస్‌ నా క్యారెక్టర్‌ పై పెట్టి చేశాను. 

'ఈ మనసే..' సాంగ్‌ను రీమిక్స్‌ చేశారు కదా! దాని గురించి చెప్పండి?
నేను ప‌వ‌న్‌క‌ల్యాణ్‌గారికి పెద్ద ఫ్యాన్‌ని.  'తొలిప్రేమ' నా ఫేవరెట్‌ ఫిల్మ్‌. 'ఈ మనసే' నా ఆల్‌టైం ఫేవరెట్‌ సాంగ్‌ కూడా. `తొలిప్రేమ` సినిమా చూసిన‌ప్పుడు నేను భ‌విష్య‌త్తులో హీరో అయ్యి.. ఓ ల‌వ్‌స్టోరీ చేస్తే అందులో ఈ పాట‌ను రీమేక్స్ చేయాల‌ని అనుకున్నాను. ఐదు రోజుల పాటు 60 మంది డ్యాన్స‌ర్స్‌, 120 మంది టెక్నీషియ‌న్స్ 5 రోజుల పాటు బాగా ప్రాక్టీస్ చేసి రామోజీ ఫిల్మ్‌ సిటీలోని లండన్‌ స్ట్రీట్లో సాంగ్‌ను చిత్రీక‌రించాం. ఈ సాంగ్‌ను ప‌వ‌న్‌క‌ల్యాణ్‌గారు విడుద‌ల చేశారు. ఆయ‌నకు ఇది సింగిల్ షాట్‌లో చేసిన పాట అని చెప్ప‌లేదు. ఆయ‌న సాంగ్ చూసి ఎంజాయ్ చేశారు. ఇది సింగిల్ టేక్‌లో చేశారుగా అని ఆ త‌ర్వాత అన్నారు. అవును సార్‌! అన్నాను. నీ క‌ష్టం క‌న‌ప‌డుతుంది అన్నారు.  ఫ్యాన్స్‌కు కూడా త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది.