మ‌రి ఏడాది ముందే డేట్ ప్ర‌క‌టించ‌డ‌మెందుకో!

Unprofessionalism of Tollywood directors regarding release dates
Wednesday, March 6, 2019 - 22:15

ఒక‌ప్ప‌టితో పోల్చితే ఇపుడు తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ప్రొఫెష‌నిలిజం వ‌చ్చింది. రిలీజ్ డేట్స్‌ని చాలా ముందుగానే ఫిక్స్ చేసి..దానికి క‌ట్టుబ‌డి ఉంటున్నారు. ముఖ్యంగా సంక్రాంతి, ద‌సరా వంటి ఇంపార్టెంట్ డేట్స్ విష‌యంలో మాత్రం మార్పు ఉండ‌డం లేదు. ఐతే వంశీ పైడిప‌ల్లి వంటి కొంద‌రు ద‌ర్శ‌కులు మాత్రం ఇప్ప‌టికీ చెప్పిన డేట్‌కి సినిమాని పూర్తి చేయ‌లేక‌పోతున్నారు. ట్రేడ్ వ‌ర్గాలు వంశీ పైడిప‌ల్లి, సుకుమార్ వంటి కొంద‌రు ద‌ర్శ‌కుల‌కి చెక్కుడు డైరక్ట‌ర్స్ అని నామ‌క‌రణం చేసింది. ఏ సినిమాని చెప్పిన డేట్‌కి పూర్తి చేయ‌రు. అనేక సార్లు వాయిదాలు కోరుతారు.

"మ‌హ‌ర్షి" సినిమాకి ఏడాదిన్న‌ర‌కి పైగా స్ర్కిప్ట్ మీద కూర్చున్నాడు (ఈ విష‌యం దిల్‌రాజే స్వ‌యంగా ప్రెస్‌మీట్‌లో చెప్పాడు) వంశీ పైడిప‌ల్లి. ఇక సినిమా గ‌తేడాది జూన్‌లో మొద‌లైంది. మ‌హేష్‌బాబు పుట్టిన రోజైన ఆగ‌స్ట్ 9న తొలి లుక్‌, టైటిల్ ప్ర‌క‌ట‌న చేశారు. అదే రోజు విడుద‌ల తేదీని (ఏప్రిల్ 5, 2019) ప్ర‌క‌టించారు. ఆగ‌స్ట్ 9న రిలీజ్ డేట్ ప్ర‌క‌టించిన‌పుడే.. ద‌ర్శ‌కుడికి తెలియాలి క‌దా... ఎలా ప్లాన్ చేసుకుంటే సినిమా పూర్త‌వుతుంద‌నేది. అప్ప‌టికి షూటింగ్‌లో జాప్యం జ‌రుగుతోంద‌నే ఏప్రిల్ 5 నుంచి ఏప్రిల్ 25కి డేట్ మార్చారు. ఐనా కూడా క్వాలిటీ విషయంలో రాజీప‌డొద్దంటే ఇంకా టైమ్ కావాలి...అన‌డం ఏంటో! 

తీసేది "బాహుబ‌లి", "2.0" చిత్రాల్లాగా...వంద‌శాతం విజువ‌ల్ ఎఫెక్ట్స్‌తో కూడిన ఫాంట‌సీ లేదా సైన్స్ ఫిక్ష‌న్ మూవీ అయితే...చెప్పిన టైమ్‌కి సినిమా పూర్తి కాలేదంటే అర్థం చేసుకోవ‌చ్చు. ఒక సాధార‌ణ సోష‌ల్ డ్రామాకి ఇన్ని వాయిదాలు అంటే చెక్కుడులో పీక్ స్టేజ్ అయినా అయి ఉండాలి లేదా క‌న్‌ఫ్యూజ‌న్ అయినా కావాలి. 

ఎలాగూ చెప్పిన టైమ్‌కి ప్రొడ‌క్ట్‌ని అందివ్వ‌లేన‌పుడు ఏడాది ముందే ఆరునూరైనా ఫ‌లానా రోజు వ‌స్తామ‌ని చెప్పొద్దు. అభిమానుల‌ను ఊరించి వారిని నిరాశ‌ప‌ర్చొద్దు.