ఆ కాంబినేషన్ ఉత్తిదే

Veeru Potla and Akhil's film, a false news
Tuesday, July 14, 2020 - 16:15

ఓ వైపు సురేందర్ రెడ్డి-అఖిల్ కాంబినేషన్ లో సినిమా అంటూ ప్రచారం సాగుతోంది. మరోవైపు అదే అఖిల్ తో త్వరలోనే వీరుపోట్ల సెట్స్ పైకి వెళ్లబోతున్నాడంటూ మరో ప్రచారం ఊపందుకుంది. మొదటిది పక్కనపెడితే.. రెండో ప్రచారం మాత్రం మరీ గాలివార్త. అసలు వీళ్లిద్దరు ఈమధ్య కాలంలో కలిసిందే లేదంట

గతంలో నాగార్జునతో "రగడ" అనే సినిమా తీశాడు వీరుపోట్ల. ఆ రిఫరెన్స్ తో అఖిల్ ను కలిసి మంచి క్లాస్-మిక్స్ స్టోరీ చెప్పాడని.. ప్రస్తుతం చేస్తున్న "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" కంప్లీట్ అయిన వెంటనే ఈ సినిమాకు కొబ్బరికాయ కొడతారంటూ స్టోరీలు వచ్చేశాయ్.

కట్ చేస్తే... అసలు తను అలాంటి ప్రయత్నాల్లో లేనని స్పష్టంచేశాడు వీరు పోట్ల. నిజంగా అఖిల్ ను డైరక్ట్ చేసే ఛాన్స్ వస్తే వదులుకోనని, తను మాత్రం ఇప్పటివరకు ఆ దిశగా ప్రయత్నించలేదని అంటున్నాడు.

చాన్నాళ్ల కిందటే సినిమాలు వదిలేశాడు వీరు పోట్ల. ఏడేళ్ల కిందటొచ్చిన "దూసుకెళ్తా".. నాలుగేళ్ల కిందటొచ్చిన "ఈడు గోల్డు ఎహే" సినిమాలు రెండూ డిజాస్టర్ అవ్వడంతో ప్రస్తుతం ఇంటికే పరిమితమై, వెబ్ కంటెంట్ ఏదో రాసుకుంటున్నాడు ఈ డైరక్టర్.