వెంకీ లీడర్ ఐతే ఎలా ఉండేది?

Venkatesh was to do LEADER?
Monday, June 8, 2020 - 17:15

దగ్గుబాటి రానాను వెండితెరకు పరిచయం చేసిన సినిమా "లీడర్". అలా మొదటి సినిమాతోనే రానా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఇదే సినిమాలో రానా ప్లేస్ లో వెంకటేష్ ను ఊహించుకోండి. కాస్త గమ్మత్తుగా అనిపిస్తోంది కదా. కానీ అలా గమ్మత్తుగా అనిపించేదే అసలైన నిజం అంటున్నాడు నిర్మాత సురేష్ బాబు.

అవును.. వెంకటేష్ తో చేయాలనుకున్న "లీడర్" సినిమా అనుకోకుండా రానా వద్దకు వెళ్లిందని, అలా రానా హీరోగా మారిపోయాడని అసలు విషయం బయటపెట్టాడు సురేష్ బాబు.

"విజువల్ ఎఫెక్ట్స్ చేసి స్టూడియో పెట్టాడు రానా. కొన్ని రోజులకు నా దగ్గరకొచ్చి క్లోజ్ చేస్తున్నట్టు చెప్పాడు. అప్పుడు రానాకు నేను ఆప్షన్స్ ఇచ్చాను. నిర్మాత, దర్శకుడు, హీరో ఆప్షన్లు ఇచ్చాను. వాడు హీరో అవుతానన్నాడు. చాలా కష్టపడాలి ఇంత బరువు (అప్పట్లో రానా చాలా బరువు) ఉంటే కుదరదని చెప్పాను. బాగా తయారై వచ్చాడు. అదే టైమ్ లో శేఖర్ కమ్ముల, 'లీడర్' కథ చెప్పాడు. వెంకటేష్ తో తీయమని చెప్పాను. నాకు రానా కావాలన్నాడు. శేఖర్, రానాలో ఏం చూశాడో తెలీదు. లేదంటే వెంకటేష్ చేయాల్సిన సినిమా అది."

ఇలా 'లీడర్' తెరవెనక కథను బయటపెట్టాడు సురేష్ బాబు. తను ఇంజనీరింగ్ చదివి నిర్మాత అయ్యానని, వెంకటేష్ ఎంబీఏ చేసి హీరో అయ్యాడని, రానా కూడా విజువల్ ఎఫెక్ట్స్ చేసి నటుడు అయ్యాడని.. ఇలా తమ కుటుంబంలో ఎవ్వరూ ఏదీ ప్లాన్ చేసి అవ్వలేదన్నారు సురేష్ బాబు. వెంకీ కొడుకు అర్జున్, తన చిన్నకొడుకు అభిరామ్ పై కూడా ఎలాంటి ఒత్తిడి పెట్టడం లేదని.. వాళ్లకు నచ్చింది వాళ్లు చేస్తారని తెలిపాడు.