హీరో వేషాలు వెయ్య‌ను

Vennela Kishore says he will not play hero roles!
Tuesday, May 23, 2017 - 23:15

వెన్నెల కిషోర్ ఇపుడు టాలీవుడ్‌లో లీడింగ్ క‌మెడియ‌న్‌. కామెడీతో న‌వ్విస్తాడు. మంచి న‌ట‌న‌తో మెప్పిస్తాడు. ఏ పాత్ర ఇచ్చినా త‌న మార్క్‌ని చూపుతాడు. ఇటీవ‌ల విడుద‌లైన "కేశవ‌" ఆయ‌నకి మ‌రోసారి మంచి పేరు తెచ్చిపెట్టింది. సీరియ‌స్‌గా ఉంటూనే న‌వ్వించాడు అందులో. మ‌నీ సినిమాలో ఖాన్‌దాదాలాంటి పాత్ర అది. ఇపుడు కిషోర్ ఎంట్రీకే క్లాప్స్ ప‌డుతున్నాయి.

" సినిమా ఆరంభం నుండి ఎండింగ్ వరకు ఒకటే ఎమోషన్ అని  మొదట డైరెక్టర్ సుధీర్ వర్మ చెప్పిన‌పుడు.. ఆ పాత్రలో కామెడీ ఏం ఉంటుంది అనుకున్నా. కానీ షూటింగ్ టైంలో తెలిసింది అందులో ఎంత ఉందో. ఆడియన్స్ కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు. చాలా హ్యాపీగా ఉంది, " అని త‌న ఆనందాన్ని పంచుకున్నాడు కిషోర్‌. మ‌రోవైపు, ఆయన కీలకపాత్ర పోషిస్తున్న తాజా చిత్రం "అమీ తుమీ". జూన్ 2న విడుద‌ల కానుంది. ఈ సినిమా విశేషాల‌తో పాటు త‌న కెరియ‌ర్ గురించి ఆయ‌న మాట‌ల్లోనే...

అమీ తుమీలో నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్.. 
"అమీ తుమీ" లో నాది కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్. అడివి శేష్, అవసరాల పాత్రలతో సమానంగా నా పాత్రను రాశారు ద‌ర్శ‌కుడు ఇంద్ర‌గంటి. ఇందులో కొన్ని నెగెటివ్ షేడ్స్ కూడా ఉంటాయి. కానీ అవన్నీ ఫన్నీగానే ఉంటాయి. రెండు రోజుల్లో నా జీవితంలో ఏం జరుగుతుంది అనేదే కథ. పెళ్లి కోసం వచ్చిన నేను అడివి శేష్, అవసరాల శ్రీనివాస్ ల ప్రేమ కథల మధ్యలోకి ఎలా వెళతాను, ఆ టైమ్ లో నా జీవితంలో ఏం జరుగుతుంది అనేది మంచి కామెడీని జనరేట్ చేస్తుంది. స్టోరీ పరంగా చూస్తే నేను విలన్.

ద‌ర్శ‌కుడు ఇంద్ర‌గంటితో వ‌రుస‌గా నాకిది రెండో సినిమా. ఫస్ట్ టైమ్ ఆయనతో "జెంటిల్మెన్" సినిమా చేశాను. ఇప్పుడు ఈ సినిమా చేస్తున్నాను. సినిమాకి కొన్ని రోజుల ముందే అయన పూర్తి స్క్రిప్ట్ తో సహా మాకిచ్చేశారు. మేము కూడా ముందుగానే ప్రాక్టీస్ చేశాం. దాంతో షూటింగ్ స్పాట్‌కి వెళ్ళాక కెమెరా ముందు పెద్ద కష్టమనిపించలేదు. ఆయనతో వర్క్ చాలా ఈజీగా ఉంటుంది.

150 సినిమాలు చేశా 
కెరియ‌ర్ ప‌రంగా పూర్తి సంతృప్తిగా ఉన్నాను. ఇప్పటికే 150 సినిమాల దాకా చేశాను. ఒక్కోసారి రావాల్సిన దానిక‌న్నా ఎక్కువే పేరు వచ్చేసిందేమో అనిపిస్తుంది. ఒకప్పుడు థియేటర్లలో ఏ హీరోలకైతే విజిల్స్ వేశానో ఇప్పుడు ఆ హీరోల పక్కనే నటిస్తుండటం చాలా సంతోషంగా అనిపిస్తోంది.

హీరో వేషాలు వెయ్య‌ను...
నేను అస‌లు హీరోగానే సెట్టవ్వను. ఒకసారి షూటింగ్ చేస్తున్నప్పుడు డైరెక్టర్ రాఘవేంద్రరావుగారు పిలిచి కామెడీ బాగా చేస్తున్నావ్. హీరోగా మాత్రం చేయనని మాటివ్వు అన్నారు. నేను కూడా అస్సలు చేయనని ఒట్టేశాను.