ఆ హీరోల్ని కలిపాయి ఐటీ రైడ్స్

Vijay and Ajith fans unite
Monday, February 10, 2020 - 21:30

మొన్నటివరకు ఆ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. ఆ హీరోలు మరెవరో కాదు. ఒకరు విజయ్, మరొకరు అజిత్. ఈ ఇద్దరు స్టార్ హీరోల అభిమానులకు అస్సలు పడదు. వాళ్లు ఒకటంటే, వీళ్లు పది అంటారు. చివరికి వీళ్ల సోషల్ మీడియా కయ్యం ఏ రేంజ్ కు చేరుకుందంటే.. ఒకరికొకరు పోటీలు పడి శ్రద్ధాంజలి ఫొటోలు కూడా పెట్టుకున్నారు. రిప్ విజయ్, రిప్ అజిత్ ట్రోల్స్ ఓ రేంజ్ లో నడిచాయి.

ఇన్నాళ్లకు ఆ హీరోలిద్దరి అభిమానులు ఒక్కటయ్యారు. ఇంట్రెస్టింగ్ గా అభిమానులు ఇలా కలవడానికి కారణం ఆదాయపు పన్ను శాఖ దాడులు. తాజాగా విజయ్ ఇళ్లు, ఆఫీస్ పై ఐటీ రైడ్స్ జరిగాయి. దీంతో కోలీవుడ్ లో కలకలం మొదలైంది. విజయ్ పై జరిగిన ఐటీ దాడిని చాలామంది ఖండించారు. విజయ్ కు సంఘీభావంగా అజిత్ కూడా యాక్ట్ అయ్యాడు.

విజయ్ కు మద్దతుగా మాట్లాడిన అజిత్.. రాజకీయ నాయకుల ఇళ్లపై ఐటీ దాడులు చేస్తే దేశంలో పేదరికం పోతుందంటూ వ్యాఖ్యానించాడు. సెలబ్రిటీల ఇళ్లు సాఫ్ట్ టార్గెట్ గా మారాయంటూ ఆరోపించాడు. ఇలా ఊహించని విధంగా విజయ్ కు అజిత్ నుంచి మద్దతు దక్కడంతో.. ఫ్యాన్స్ ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. విజయ్ ఫ్యాన్స్, అజిత్ ఫ్యాన్స్ ఇద్దరూ ఇప్పుడు కలిసిపోయారు. ఈ కలుపుగోలుతనం ఎన్నిరోజులు మెయింటైన్ చేస్తారో చూడాలి.

మరోవైపు విజయ్ మాత్రం ఐటీతో తాడోపేడో తేల్చుకోవడానికి రెడీ అయ్యాడు. ప్రశ్నించడానికి రమ్మని నోటీసులు ఇస్తే, ఇప్పుడు కుదరదంటూ సమాధానం ఇచ్చాడు. ఇప్పటికే పొలిటికల్ టర్న్ తీసుకున్న ఈ వివాదం, రాబోయే రోజుల్లో ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి. చివరికి ఇది ఎక్కడివరకు వెళ్లిందంటే.. రజనీకాంత్ తో కలిసి రాజకీయాల్లోకి రాబోతున్నారనే ప్రచారం కూడా తమిళ రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.