నానిని దాటేసిన విజ‌య్

Vijay Deverakonda joins Rs 40 Cr club
Wednesday, August 22, 2018 - 23:30

నాని న‌టించిన "ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం" సినిమాలో సైడ్ హీరోగా న‌టించాడు విజ‌య్ దేవర‌కొండ‌. ఆ సినిమాలో రిషి పాత్ర‌లో నేచుర‌ల్‌గా న‌టించి ఫిల్మ్‌ల‌వ‌ర్స్ దృష్టిలో ప‌డ్డాడు విజ‌య్‌. "ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం" సినిమా నాని కెరియ‌ర్‌ని మ‌ళ్లీ స‌క్సెస్ ట్రాక్‌లోకి తీసుకొచ్చింది. ఆ సినిమాకి ముందు వ‌రుస‌గా ఫ్లాప్‌ల‌తో స‌త‌మ‌త‌య్యాడు. ఆ త‌ర్వాత వ‌రుస‌గా ఆరు హిట్లు ఇచ్చాడు. "భ‌లే భ‌లే మ‌గాడివోయి" నుంచి "ఎంసీఏ" వ‌ర‌కు నాని దూసుకుపోయాడు. పాపులారిటీ ప‌రంగా నాని ఇపుడు ఎక్క‌డో ఉన్నాడు.

ఈ మ‌ధ్య కాలంలో స్టార్‌గా గొప్ప ఎదుగ‌ద‌ల చూసిన న‌టుడు నాని అని అంద‌రూ అనుకుంటున్న టైమ్‌లో ఇపుడు విజ‌య్ మొత్తం ఈక్వేష‌న్ మార్చేశాడు. క‌లెక్ష‌న్ల ప‌రంగా నానిని దాటేశాడు. హీరోగా, వ‌రుస విజ‌యాల ట్రాక్ రికార్డు ప్ర‌కారం విజ‌య్ దేవ‌ర‌కొండ నాని రికార్డును బ్రేక్ చేయ‌లేదు కానీ..ఓపెనింగ్స్ ప‌రంగా, యూత్‌లో క్రేజ్ ప‌రంగా మాత్రం విజయ్ ప్ర‌స్తుతం నాని క‌న్నా ముందున్నాడు అనిపిస్తోంది.

నాని కెరియ‌ర్‌లో బిగెస్ట్ హిట్‌.."ఎంసీఏ". ఆ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా 34 కోట్ల రూపాయ‌ల‌ను క‌లెక్ట్ చేసింది. "గీత గోవిందం" 8 రోజుల్లోనే 40 కోట్ల రూపాయ‌ల షేర్ అందుకొంది. ఈ సినిమాతో నానిని దాటేశాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.

ఐతే నానిలా విజ‌య్ వ‌రుస‌గా విజ‌యాలు అందించ‌గ‌ల‌డా? మినిమ‌మ్ గ్యారెంటీ హీరో అనిపించుకోగ‌ల‌డా అనేది కాల‌మే చెపుతుంది. ప్ర‌స్తుతానికి బాక్సాఫీస్ కింగ్‌..ఈ గోవింద్‌. ఏదీ ఏమైనా, నానిలా ఒక 30, 40 కోట్ల రూపాయ‌ల మార్కెట్ ఉన్న మ‌రో హీరో దొర‌కడం నిర్మాత‌ల‌కి ఒక వ‌ర‌మే. పెద్ద హీరోల డేట్స్ దొర‌కడం క‌ష్టంగా మారింది. మిడిల్ రేంజ్ హీరోలు ఎంత‌మంది పెరిగితే ఇండ‌స్ట్రీకి మంచిది.