రూమర్లకు చెక్ పెట్టిన విజయ్

Vijay Sethupathi puts an end ro rumors about Uppena
Monday, August 19, 2019 - 18:45

"ఉప్పెన".. ఈ సినిమాపై ఎలాంటి బజ్ లేదు. కానీ ఆమధ్య మాత్రం ఓ 4 రోజుల పాటు బాగా నలిగింది. దీనికి కారణం ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్న విజయ్ సేతుపతి, ఆ తర్వాత తప్పుకున్నాడంటూ పుకార్లు రావడమే. ఎట్టకేలకు దీనిపై ఓ క్లారిటీ వచ్చేసింది. అప్పుడొచ్చిన పుకార్లలో నిజం లేదని ఇప్పుడు తేలింది. ఇవాళ్టి నుంచి విజయ్ సేతుపతి సెట్స్ పైకి వచ్చేశాడు.

సాయితేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న ఉప్పెన సినిమాలో నెగెటివ్ రోల్ కోసం విజయ్ సేతుపతిని ఎంపిక చేశారు. ఈరోజు నుంచి సారధి స్టుడియోస్ లో విజయ్ సేతుపతి, వైష్ణవ్ తేజ్ పై సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. సినిమాకు సంబంధించి ఇది రెండో షెడ్యూల్. 

సుకుమార్ దగ్గర పనిచేసిన బుచ్చిబాబు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. కృతి షెట్టి అనే అమ్మాయిని హీరోయిన్ గా పరిచయం చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను డిసెంబర్ లో విడుదల చేయాలని భావిస్తున్నారు.