విజయవాడలో ఆర్జీవీని అడ్డుకున్న పోలీసులు

దర్శక, నిర్మాత రాంగోపాల్ వర్మ విజయవాడ సిటీలోకి అడుగుపెట్టకుండా విజయవాడ పోలీసులు అడ్డుకున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం వర్మని విజయవాడ నగరంలోకి అనుమతించమని పోలీసులు తేల్చి చెప్పారు. ఆదివారం ఆయన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రమోషన్‌ని చేసేందుకు విజయవాడ వచ్చారు. నోవాటెల్‌లో ప్రెస్‌మీట్ పెడుతానంటే ఆ హోటల్ వారు అనుమతించలేదట. దాంతో ఆయన నగరంలోని పైపుల రోడ్డులో రోడ్డు మీదే ప్రెస్‌మీట్ పెడుతానని ప్రకటించారు.ఐతే పోలీసులు మాత్రం ఆయన్ని అదుపులోకి తీసుకొని తిరిగి హైదరాబాద్ పంపించారు.
ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్‌లో అప్‌డేట్ చేశారు. ఏపీలో ప్రజాస్వామ్యం లేదా అని ఆయన విరుచుకుపడ్డారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వర్మ విమర్శలు చేశారు.
మే 1న తన లక్ష్మీస్ ఎన్టీఆర్‌ని విడుదల చేస్తానని వర్మ ప్రకటించారు. ఈ సినిమా ప్రమోషన్ కోసం ఆదివారం ఉదయం విజయవాడ వెళ్లారు .సినిమా ప్రమోషన్‌లో భాగంగా తాము ప్రెస్‌మీట్ కూడా పెట్టుకోకూడదా? అని వర్మ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐనా పోలీసులు వినలేదు. వర్మతో పాటు నిర్మాత రాకేశ్‌రెడ్డిలను బలవంతంగా గన్నవరం ఎయిర్‌పోర్టుకు తరలించి.. విమానాశ్రయం లాంజ్‌లో ఇద్దరిని నిర్బంధించారు.
- Log in to post comments