విజ‌య్ సాయిది ఒక విషాదాంతం!

Vijay's Suicide: The ugly side of Tollywood's glamour!
Wednesday, December 13, 2017 - 16:00

గ్లామ‌ర్ మెరుపుల వెనుక అంతులేని చీక‌టి ఉంటుంది. పేరొందిన స్టార్స్‌, స‌క్సెస్‌ఫుల్ సెల‌బ్రిటీస్ మిన‌హాయిస్తే అంతగా బిజీ కాని, రెండు, మూడు హిట్స్ త‌ర్వాత అవ‌కాశాల్లేక ఇబ్బందిప‌డే తార‌ల జీవితాలు దుర్భ‌రం. కొంద‌రు సింపుల్‌గా సినిమా వ్యామోహాన్ని వ‌దిలించుకుంటారు. ఇత‌ర ఆదాయ మార్గాలు చూసుకోవ‌డ‌మో, వ్యాపారాల్లోకి వెళ్ల‌పోవ‌డ‌మో చేస్తుంటారు. ఐతే చాలా మంది ఆశ చంపుకోల్లేక కృష్ణాన‌గ‌ర్‌, మ‌ణికొండ‌ల్లోనే మ‌గ్గుతారు. అలాంటి వారి జీవితాల్లోకి తొంగి చూస్తే ఎంతో విషాదం క‌నిపిస్తుంది.

ఉద‌య్‌కిర‌ణ్ త‌ర్వాత న‌టుడు విజ‌య్‌సాయి ఆత్మ‌హ‌త్య‌...తెలుగు సినిమా య‌వ‌నికపై ఒక చీక‌టి మ‌ర‌క‌. ఉద‌య్‌కిర‌ణ్ ఆత్మ‌హ‌త్య ఇప్ప‌టికీ మిస్ట‌రీనే! విజ‌య్ సాయి ఆత్మ‌హ‌త్య‌లో మిస్ట‌రీ లేదు విషాద‌మే ఉంది. భార్య, కూతురు అంత్య‌క్రియ‌ల‌కి కూడా రాని ద‌య‌నీయ స్థితి.

ఇద్ద‌రిలో ఎవ‌రు త‌ప్పు చేశారు, ఏమి జ‌రిగింద‌నేది ప‌క్క‌న పెడితే.. ఆర్థిక ప‌రిస్థితులు, అవ‌కాశాల్లేమి గ్లామ‌ర్ తార‌ల (చిన్న స్టార్స్ అయినా, పెద్ద స్టార్స్ అయినా) జీవితాల‌కి ఎలాంటి క్ల‌యిమాక్స్ ఇస్తుందో ఇదొక ఉదాహ‌ర‌ణ‌. విజ‌య్ సాయి భార్య‌ని అరెస్ట్ చేయ‌క‌త‌ప్ప‌ద‌ని పోలీసులు మీడియాకి హింట్ ఇచ్చారు. కానీ విజ‌య్ సాయి మ‌ర‌ణం..మ‌రోసారి సినిమా తార‌ల అగ్లీ రిలేష‌న్స్ వైనాన్ని చూపించింది.