ఈ శీనయ్య వచ్చాడు.. ఆ శీనయ్య పోయాడు

Vinayak's Seenayya put on hold?
Thursday, February 13, 2020 - 09:45

ప్రస్తుతం శీనయ్య అంటే అందరికీ విజయ్ దేవరకొండ మాత్రమే గుర్తొస్తున్నాడు. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో అతడు పోషించిన ఓ పాత్ర పేరు శీనయ్య. తెలంగాణ యాసలో మాట్లాడుతూ, సింగరేణి బొగ్గుగనిలో పనిచేసే పాత్రకు పెట్టిన పేరు అది. అది తనకు వెరీ వెరీ స్పెషల్ అంటున్నాడు విజయ్ దేవరకొండ. దీంతో అంతా ఆ శీనయ్య గురించే మాట్లాడుతున్నారు. అయితే ఈ క్రమంలో మరో శీనయ్య మాయమైపోయాడు

అవును.. అంతా విజయ్ దేవరకొండ చేసిన శీనయ్య పాత్ర గురించి మాట్లాడుకుంటున్న టైమ్ లోనే.. వినాయక్ హీరోగా చేయాల్సిన శీనయ్య సినిమా ఆగిపోయింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రావాల్సిన ఈ సినిమాను నిర్మాత దిల్ రాజు దాదాపు ఆపేసినట్టే అని తెలుస్తోంది.

శీనయ్య మూవీ కోసం వినాయక్ చాలా కష్టపడ్డాడు. జిమ్ లో కసరత్తులు చేసి బాగా తగ్గాడు. అతడి న్యూ లుక్ కూడా అందర్నీ ఎట్రాక్ట్ చేసింది. వినాయక్ పెట్టుకున్న విగ్గు ఎవ్వరికీ నచ్చకపోయినా, అతడు తగ్గిన విధానం చూసి అంతా మెచ్చుకున్నారు. అప్పటికే సినిమా కూడా లాంఛ్ చేయడంతో, ఇక సెట్స్ పైకి వెళ్లడమే ఆలస్యం అనుకున్నారంతా. కానీ ఊహించని విధంగా ఆ ప్రాజెక్టును దిల్ రాజు పక్కన పెట్టాడట. అంటే సినిమా మొత్తంగా ఆగిపోలేదు. మళ్లీ పట్టాలెక్కడానికి ఇంకొంత టైం పట్టేలా ఉంది.