అమలాని పెళ్లి చేసుకోవట్లేదు!

పెళ్లయిన ఏడాదికే భర్త నుంచి విడాకులు తీసుకొంది అందాల అమలాపాల్. తెలుగులో "నాయక్", "లవ్ ఫెయిల్యూర్", "బెజవాడ" వంటి సినిమాల్లో నటించిన అమలాపాల్ తమిళ దర్శకుడు ఎ.ఎల్.విజయ్‌ని ప్రేమించి, పెళ్లాడింది. కానీ ఇద్దరి మధ్య విభేదాలు పొడసూపడంతో ఏడాదికే విడిపోయారు. డివోర్స్ తీసుకున్నారు. అప్పట్నుంచి ఆమె ఒంటరిగానే ఉంటోంది. హీరోయిన్‌గా మళ్లీ బిజీ అయింది.
ఇటీవల ఆమె ఓ తమిళ యువ హీరోతో ప్రేమలో పడిందని, అతన్ని పెళ్లి చేసుకోనుందని వార్తలు వచ్చాయి.
"రాక్షసన్" అనే ఒక తమిళ సినిమా ఇటీవల విడుదలై మంచి విజయం సాధించింది. త్వరలోనే ఈ సినిమా తెలుగులోనూ రీమేక్ కానుంది. ఈ సినిమాలో విష్ణు విశాల్ హీరో. అతని సరసన అమలాపాల్ నటించింది. సినిమాలోనే కాదు ఆఫ్‌స్క్రీన్‌లోనూ వీరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరిందని, పెళ్లికి ముహూర్తం చూసుకుంటున్నారని ఒక వెబ్‌సైట్ కథనాన్ని ప్రచురించింది. ఆ వార్తకి స్పందిస్తూ ..విష్ణు విశాల్ ట్వీట్ చేశాడు. "ఇలాంటి మతిలేని వార్తలు రాయొద్దు. కొంచెం బాధ్యతగా ప్రవర్తించండి. మేం మనుషులమే, మాకు కూడా కుటుంబాలుంటాయి. ఇలాంటి నిరాధర వార్తలు ప్రచురించి బాధ కలిగించొద్ద,"ని ఘాటుగా స్పందించాడు.
ఆమెతో పెళ్లి వార్తలను తోసిపుచ్చాడు విష్ణు విశాల్.
అమలాపాల్ ఈ వార్తలపై ఇంకా రెస్పాండ్ కాలేదు. ఈ యువ హీరో కూడా తన భార్య నుంచి ఇటీవలే విడాకులు తీసుకున్నాడు. దాంతో ఈ పుకార్లకి బలం వచ్చినట్లు అయింది. ఐతే విష్ణు విశాల్ మాత్రం ఈ పుకార్లకి ఎండ్‌కార్డ్ వేశాడు.
- Log in to post comments