రేపు ఏ సినిమా క్లిక్ అవుతుందో!

This weekend many releases
Thursday, November 21, 2019 - 14:00

ఈ వీకెండ్ బాక్సాఫీస్ ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది. పేరుకు అన్నీ చిన్న సినిమాలే కానీ ఉన్న వాటిల్లో 2-3 సినిమాలపై కూసింత అంచనాలున్నాయి. ఉదాహరణకు జార్జిరెడ్డినే తీసుకుంటే, ఈ సినిమాపై కుర్రాళ్లు బాగానే ఫోకస్ పెట్టారు. రియల్ లైఫ్ స్టోరీ కావడం, సినిమా గురించి చిరంజీవి లాంటి వ్యక్తి మాట్లాడ్డం సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. ఇవన్నీ ఒకెత్తయితే, ట్రయిలర్ హిట్ అవ్వడం, 2 పాటలు క్లిక్ అవ్వడం ఈ సినిమాకు కలిసొచ్చింది.

జార్జిరెడ్డికి పోటీగా మరో 2 చిన్న సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిలో ఈషా రెబ్బ నటించిన రాగల 24 గంటల్లో అనే సినిమాతో పాటు రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించిన తోలుబొమ్మలాట సినిమాలున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా ఓ మోస్తరుగా ఎట్రాక్ట్ చేస్తున్నాయి. కచ్చితంగా ఉత్కంఠకు గురిచేస్తామంటోంది రాగల 24 గంటల్లో సినిమా యూనిట్.

అటు తోలుబొమ్మలాట సినిమాపై రాజేంద్రప్రసాద్ ఏకంగా బెట్ కట్టే స్టేజ్ లో ఉన్నారు. సినిమా హిట్ గ్యారెంటీ అంటున్నారాయన. ప్రస్తుతానికైతే ఈ వీకెండ్ ఈ  3 సినిమాల మధ్య మాత్రమే పోటీ కనిపిస్తోంది. వీటితో పాటు మరో 3 చిన్న సినిమాలున్నాయి. బీచ్ రోడ్ చేత, పిచ్చోడు, ట్రాప్ అనే మూడు చిత్రాలు కూడా రేపే రిలీజ్ అవుతున్నాయి.

వీటిలో ఏదైనా కంటెంట్ తో ఆకట్టుకుంటే కొన్ని రోజులు నిలబడుతుంది. మరీ ముఖ్యంగా బీచ్ రోడ్ చేతన్ అనే సినిమాకు రేపు మొదటి రోజు మొదటి ఆట ప్రవేశం ఉచితం. ఇదో రకమైన పబ్లిసిటీ. ఇన్ని స్ట్రయిట్ సినిమాల మధ్య ఎప్పట్లానే 2 డబ్బింగ్ మూవీస్ కూడా వస్తున్నాయి. జ్యోతిక నటించిన జాక్ పాట్ సినిమా అదే పేరుతో తెలుగులోకొస్తోంది. ఇది సీరియస్ సినిమా కాదు, పక్కా కామెడీ మూవీ అంటోంది జ్యోతిక. దీంతో పాటు ఫ్రోజెన్ 2 అనే సినిమా కూడా ఉంది. హాలీవుడ్ సినిమాలు,మరీ ముఖ్యంగా యానిమేషన్ సినిమాలు ఇష్టపడే వాళ్లు ఈ వీకెండ్ కచ్చితంగా ఈ సినిమానే చూస్తారు. పైగా, తెలుగు వెర్షన్ కోసం మహేష్ కూతురు సితార ఓ పాత్రకు డబ్బింగ్ చెప్పడం మరో విశేషం.

ఇలా ఈ వీకెండ్ ఏకంగా 8 చిత్రాలు బాక్సాఫీస్ బరిలో తలపడబోతున్నాయి. అన్నీ చిన్న సినిమాలే. వీటిలో ఏదైనా ఒక్క సినిమానైనా సైలెంట్ గా హిట్ కొడుతుందా.. లేక అన్నీ గంపగుత్తగా చుట్టేస్తాయా అనేది మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.