ప్ర‌భాస్ అడిగిన‌దాంట్లో త‌ప్పేముంది?

What is wrong in Prabhas's demand?
Tuesday, October 31, 2017 - 14:45

"బాహుబ‌లి 2" త‌ర్వాత ప్ర‌భాస్ రేంజ్ హిమాలయ ప‌ర్వతాల స్థాయికి (పాపులారిటీ ప‌రంగా) ఎదిగింద‌ని చెప్పొచ్చు. బాహుబ‌లి సినిమాలు ఆ రేంజ్‌లో హిట్ట‌వ్వ‌డానికి అసలు రీజ‌న్‌ రాజ‌మౌళి ప్ర‌తిభాపాట‌వాలే అన‌డంలో డౌట్ ఏమీ లేదు. కానీ ఆ సినిమాల‌తో ప్ర‌భాస్ మ‌గువ‌ల మ‌న‌సు దోచుకున్నాడ‌నంలోనూ సందేహం అక్క‌ర్లేదు. సౌత్‌, నార్త్ అనే తేడా లేదు ప్రభాస్ మేన్లీనెస్‌కి అమ్మాయిలంతా ఫిదా.

కొన్ని ఫేస్‌బుక్ ఐడీలు చూస్తే ఆశ్చ‌ర్య‌పోతాం... అమ్మాయిలు, ఆంటీలు ప్ర‌భాస్ ఫోటోల‌ను టాప్ పేజ్‌గా డెకరేట్ చేసుకొని హ‌ల్‌చ‌ల్ చేస్తున్నారు. ఈ భామ‌లు ఎక్కువ‌గా నార్త్ ఇండియ‌న్ వారే కావ‌డం విశేషం.

ప్ర‌భాస్‌కి సంబంధించిన ఏ వీడియో అప్‌లోడ్ చేసినా, అతను ఫేస్‌బుక్‌లో ఏ పోస్ట్ పెట్టినా...వైర‌ల్ అవుతోందిపుడు. అది అత‌నికున్న క్రేజ్‌. అంత క్రేజుంది కాబ‌ట్టే క‌ర‌ణ్ జోహార్ ఆ పాపులారిటీని క్యాష్ చేసుకోవాల‌నుకున్నాడు. కానీ ప్ర‌భాస్ 20 కోట్ల రూపాయ‌ల పారితోషికం డిమాండ్ చేయ‌డంతో క‌ర‌ణ్ జోహార్ పారిపోయాడ‌ని జ‌ర్న‌లిస్ట్ సుభాష్ కే ఝా ఒక క‌థ‌నం వండి వార్చాడు. సో ఇపుడు ప్ర‌భాస్‌తో బాలీవుడ్ సినిమాని తీయ‌డం లేద‌ట‌. సుభాష్ కే ఝా రాసే న్యూస్‌ల గురించి తెలిసిన వారు ఎవ‌రైనా అది గ్యాసే అని ఇట్టే క‌నిపెట్టేస్తారు.

స‌రే...స‌పోజ్ ..ఫ‌ర్ స‌పోజ్ అందులో నిజ‌మే ఉంద‌నుకుందాం. ఇంత‌కీ ప్ర‌భాస్ అడిగిన దాంట్లో త‌ప్పేముంది. తిప్పి తిప్పి కొడితే ఒక్క భాష‌లోనే (తెలుగులో) 100 కోట్ల షేర్ సంపాదించ‌లేక‌పోతున్న కొంద‌రు బ‌డా హీరోలు 20 కోట్ల‌పైనే పారితోషికం తీసుకుంటున్నపుడు మ‌ల్టీ లాంగ్వేజ్‌స్‌లో మార్కెట్ ఉన్న ప్ర‌భాస్ 20 కోట్లు అడిగితే త‌ప్పేంటట‌!

ర‌ణ‌బీర్ క‌పూర్ వంటి బాలీవుడ్ న‌టుడు రీసెంట్‌గా నాలుగు సినిమాలు విడుద‌ల చేస్తే...అందులో ఒక్క‌టీ  ఇండియాలో 100 కోట్ల రూపాయ‌ల వ‌సూళ్ళు అందుకోలేదు. అలాంటి హీరోకి క‌ర‌ణ్ జోహార్ 30 కోట్ల పారితోషికం ఇచ్చాడు. ఆ లెక్క‌న చూస్తే ప్ర‌భాస్ అడిగిన పారితోషికం ఎంత‌? 20 కోట్లు (నిజంగా అడిగి ఉంటే) చాలా త‌క్కువ‌.