దిల్ రాజు ప్రేమిస్తే అంతే సంగతులా!

When Dil Raj falls in love with a movie
Monday, February 17, 2020 - 14:15

ప్రముఖ నిర్మాత దిల్ రాజు పట్టిందల్లా బంగారం అనే టాక్ ఉంది. అతని జడ్జిమెంట్ మీద అందరికి అంత నమ్మకం. ఆయన ప్రొడ్యూస్ చేసినా, డిస్ట్రిబ్యూట్ చేసినా ఆ సినిమాలు హిట్ అవుతాయి. కానీ ఆయన ఏదైనా సబ్జెక్ట్ ను బలంగా నమ్మి తీశాడంటే మాత్రం అది ఢమాల్. ఇప్పటికే కొన్ని సినిమాలు ఈ విషయాన్ని ప్రూవ్ చేశాయి, తాజాగా జాను మరో బలమైన ఉదాహరణగా నిలిచింది.

సినిమాలు అందరూ తీస్తారు. కొందరు మనసు పెట్టి తీస్తారు, మరికొందరు బుర్ర పెట్టి తీస్తారు. ఇక దిల్ రాజు విషయానికొస్తే, ఆయన బుర్ర పెట్టి తీసిన సినిమాలన్నీ హిట్టే. ఎప్పుడైతే మనసుకు నచ్చి, ప్రేమించి తీస్తాడో అవన్నీ ఫ్లాప్ అవుతున్నాయి. ఉదాహరణకు జాను సినిమానే తీసుకుందాం. ఆ సినిమా సబ్జెక్ట్ ఆయన మనసుకు నచ్చింది. ఆ సినిమాను ఆయన ఎంతో ప్రేమించాడు. అంత ప్రేమించాడు కాబట్టే, బుర్ర ఉపయోగించలేపోయాడు. తెలుగు ఆడియన్స్ కు జాను లాంటి సబ్జెక్ట్ కనెక్ట్ అవ్వదనే విషయాన్ని ఆ సినిమా ప్రేమలో పడి మరిచిపోయాడు.

ఇదొక్కటే కాదు, ఆమధ్య  వచ్చిన శ్రీనివాసకల్యాణం సినిమాను కూడా ఇలానే ప్రేమించాడు రాజు. ఎంతగా అంటే.. తన కెరీర్ లో బొమ్మరిల్లు తర్వాత శ్రీనివాసకల్యాణమే అని చెప్పేంత సాహసం చేశాడు. బొమ్మరిల్లు సినిమా తన బ్యానర్ కు ఎంత పేరు తెచ్చిందో, శ్రీనివాసకల్యాణం అంతకంటే ఎక్కువ పేరు తెస్తుందని ఓపెన్ స్టేట్ మెంట్స్ ఇచ్చాడు. ఎందుకంటే ఆ సినిమాను అంత ప్రేమించాడు.

అంతకంటే ముందు జోష్ అనే మూవీని కూడా ఇలానే విపరీతంగా ప్రేమించాడు. టాలీవుడ్ లో మరో శివ అయ్యే లక్షణాలు ఈ సినిమాకే ఉన్నాయన్నాడు. శివ తర్వాత టాలీవుడ్ గతిని మార్చేది జోష్ మాత్రమే అని చెప్పుకొచ్చాడు. కట్ చేస్తే అది కూడా ఫ్లాప్ అయింది.

ఇలా దిల్ రాజు ప్రేమించిన సినిమాలేవీ ఆడలేదు. సో.. ఇకపై దిల్ రాజు మనసు పెట్టి సినిమాలు తీయకుండా బ్రెయిన్ పెట్టి సినిమాలు తీయడం బెటరేమో.