పింక్ ముహూర్తం ఎప్పుడో?

When will PInk remake be launched?
Thursday, December 5, 2019 - 16:45

అదిగో తోక అంటే ఇదిగో పులి టైపులో మారింది పింక్ రీమేక్ వ్యవహారం. నిజానికి మరో హీరో ఎవరైనా ఈ రీమేక్ లోకి వస్తే, ఇంత హడావుడి ఉండేది కాదు. అక్కడున్నది పవర్ స్టార్ పవన్ కల్యాణ్. అందుకే మీడియాకు అంత హంగామా. ఎన్నికలైనప్పట్నుంచి పవన్ రీఎంట్రీ పై వరుసగా కథనాలిస్తున్న మీడియా, ఎప్పుడైతే పింక్ రీమేక్ తెరపైకొచ్చిందో ఇక అప్పట్నుంచి రెచ్చిపోవడం మొదలుపెట్టింది.

ఆ రీమేక్ కు సంబంధించి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా "పవన్ రీంట్రీకి ముహూర్తం ఫిక్స్" అనే హెడ్ లైన్ కనిపించేది. అంతలా పింక్ రీమేక్ ను వాడేసింది మీడియా. ఈ విషయంలో మీడియా ఏ రేంజ్ కు చేరిందంటే.. ఒక దశలో ఈ సినిమా షూటింగ్ కోసం అన్నపూర్ణ స్టుడియోస్ లో భారీ సెట్ వేస్తున్నారంటూ స్టోరీలు అల్లేసింది.

అక్కడ పవన్ మాత్రం పొలిటికల్ గా ఊపేస్తుంటాడు. ఆంధ్రా రాజకీయాలకు సంబంధించి ఎవర్ని కదిపినా పవన్ నుంచే డిస్కషన్ స్టార్ట్ చేస్తున్నారు. ఓవైపు ప్రెస్ మీట్లు, మరోవైపు పర్యటనలు, రెగ్యులర్ గా ట్వీట్స్ తో పవన్ ఏపీ రాజకీయాల్ని వేడెక్కిస్తున్నాడు. పవన్ పొలిటికల్ గా ఎంతలా దూసుకుపోతున్నారో, ఇటు మీడియా కూడా పింక్ రీమేక్ పై అంతలా దూసుకుపోతూ వార్తలు ఇచ్చేస్తోంది. ఇంతకీ పింక్ రీమేక్ కు ముహూర్తం ఎప్పుడో...? పవన్ చేస్తాడో చేయడో?

ఇప్పుడీ పింక్ కు తోడు కాషాయం కూడా తెరపైకి వచ్చింది. బీజేపీకి తను ఎప్పుడూ దూరం కాలేదంటూ స్టేట్ మెంట్ ఇచ్చి పెద్ద దుమారమే రేపారు పవన్. సో.. ఆయన ముందు కాషాయం కప్పుకుంటాడా.. పింక్ మొదలుపెడతాడా అనే చర్చ కూడా మీడియాలో ఊపందుకుంది.