అసురన్ తీసే సత్తా ఎవరికుంది?

Who will direct Asuran remake in Telugu?
Thursday, November 7, 2019 - 15:45

ధనుష్ నటించిన అసురన్ అనే సినిమా చూసి వెంకటేష్ బాగా ఎక్సైట్ అయ్యారు. తమిళ సినిమాలు చూస్తే వెంకటేష్ కి పూనకం వస్తుంది. వెంకీ చేసినన్ని రీమేక్ లు బహుశా ఏ బడా హీరో చెయ్యలేదు. అందుకే ఆయనికి రీమేక్ రాజా అని ముద్దు పేరు కూడా ఉంది. ఉన్నోడికి, లేనోడికి మధ్య యుద్ధం, సమాజంలోని అసమానతల గురించి సీరియస్ గా తీసిన సినిమా.. అసురన్. 

అవార్డు విన్నింగ్ సినిమాల దర్శకుడు వెట్రి మారన్ తీసిన తమిళ చిత్రం అది. ఆయన రేంజిలో తీయాలంటే కష్టమే. అందుకే ఇటీవల రామానాయుడు ప్రివ్యూ థియేటర్లో ఒక 20 మంది యువ దర్శకులకి షో వేశారు. సినిమా చూసి యాజిటీజ్ గా రీమేక్ చెయ్యగలమని ఎవరు ముందుకు వస్తే వారికి బాధ్యత అప్పగించాలని ప్లాన్ చేసారు. మొన్న అందరు చూశారు. కానీ ఫైనల్ గా ఎవరు ముందుకొచ్చారనేది తెలియలేదు. 

వెంకటేష్ నటించిన వెంకీ మామ షూటింగ్ మొత్తం పూర్తయి రిలీజ్ కి రెడీ గా ఉంది. వెంకీ ఇప్పుడు అసురన్ రీమేక్ కానీ, తరుణ్ భాస్కర్ రెడీ చేసే కొత్త కథ కానీ సెట్ మీదకి తీసుకెళ్లాలి.