తెలుగుతెరపై అజిత్ క్లిక్ అవుతాడా?

Will Ajith click this time?
Thursday, July 20, 2017 - 16:30

కోలీవుడ్ లో అజిత్ అంటే అదో పెద్ద మేనియా. ప్రస్తుతం అతడు చేస్తున్న వివేకం సినిమా టీజర్ తో ఊగిపోతున్నారు తమిళ జనం. అజిత్ అంటే అంత పిచ్చి తమిళ సినీప్రేక్షకులకు. కానీ ఆ హీరో అంటే ఇక్కడ మాత్రం చాలా లైట్. ఇంకా చెప్పాలంటే తెలుగులో సూర్య, కార్తికి ఉన్నంత క్రేజ్ కూడా అజిత్ కు లేదు. ఒకప్పుడు ప్రేమపుస్తకం, ప్రేమలేఖ, వాలి లాంటి సినిమాలతో టాలీవుడ్ ను కూడా ఓ ఊపు ఊపిన ఈ హీరోకు ఇప్పుడు మాత్రం క్రేజ్ అస్సలు లేదనే చెప్పాలి. ఇలాంటి టైమ్ లో వివేకం సినిమాతో మరోసారి తెలుగుతెరపైకి వస్తున్నాడు ఈ సీనియర్ హీరో. 

తమిళ్ లో వివేగం పేరుతో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో వివేకం పేరుతో రిలీజ్ చేస్తున్నారు. జేమ్స్ బాండ్ సినిమాల స్టయిల్ లో 110 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఇది తెరకెక్కింది. కాజల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించాడు. తాజాగా ఈ సినిమా తెలుగు టీజర్ ను విడుదల చేశారు. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారు. కొన్నేళ్ల కిందట వీరుడొక్కడే అనే డబ్బింగ్ సినిమాతో పెద్దగా ఎట్రాక్ట్ చేయలేకపోయిన అజిత్.. వివేకంతో తెలుగులో క్రేజ్ తెచ్చుకుంటాడా..? లెట్స్ వెయిట్ అండ్ సీ..