మళ్లీ తెరపైకొచ్చిన బంగార్రాజు

Will Bangarraju hit the floors this March?
Saturday, January 25, 2020 - 22:00

బంగార్రాజు.. నాగార్జున-కల్యాణ్ కృష్ణ కాంబినేషన్ లో రావాల్సిన సినిమా. ఇది ఇప్పటిది కాదు. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా ఎనౌన్స్ చేసిన తర్వాత నాగార్జున ఏకంగా 3 సినిమాలు చేశాడు. అయినప్పటికీ బంగార్రాజు ఓ కొలిక్కి రాలేదు. ఎట్టకేలకు ఈ సినిమా సెట్స్ పైకి రాబోతోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే మార్చి నుంచి ఈ సినిమా మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మొన్నటివరకు ఈ సినిమా స్క్రిప్ట్ పై పెద్దగా సంతృప్తి వ్యక్తంచేయలేదు నాగార్జున. అలా దీనికి ఎన్నో మార్పుచేర్పులు చేశాడు దర్శకుడు కల్యాణ్ కృష్ణ. సత్యానంద్ తో పాటు కూర్చొని చాలా రిపేర్లు చేశాడు. ఇక అంతా ఓకే అనుకున్న టైమ్ కు తన సోదరుడ్ని కోల్పోయాడు కల్యాణకృష్ణ. అలా సినిమా ఇంకాస్త ఆలస్యమైంది. ఇప్పుడు అన్నీ సెట్ అయిపోయాయి.

ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి అనూప్ రూబెన్స్ తో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ లో ఉన్నాడు కల్యాణ్ కృష్ణ. ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు. అటు నాగ్ కు కూడా బంగార్రాజు ప్రాజెక్టు ప్రతిష్టాత్మకంగా మారింది. వరుసగా ఫ్లాపులొస్తున్న వేళ, అచ్చొచ్చిన బంగార్రాజు పాత్రతో హిట్ కొట్టాలని భావిస్తున్నాడు