చైతూ ఓకే అంటాడా?

Will Chaitanya agree to Ye Maaya Chesave sequel?
Thursday, May 28, 2020 - 16:00

"ఏ మాయ చేసావె".. నాగచైతన్య కెరీర్ లో మొట్టమొదటి హిట్ సినిమా. సమంతను చైతూను కలిపిన సినిమా. వాళ్ల ప్రేమకు బీజం వేసిన సినిమా. ఆ తర్వాత వాళ్ల పెళ్లికి పునాదిగా నిలిచిన సినిమా. అలా చైతూ కెరీల్ లో వెరీ వెరీ స్పెషల్ గా నిలిచిన "ఏ మాయ చేసావె" సినిమాకు సీక్వెల్ తీస్తానని ప్రకటించాడు దర్శకుడు గౌతమ్ మీనన్.

2010లో అంటే.. సరిగ్గగా పదేళ్ల కిందట ఈ సినిమా చేస్తున్నప్పుడు నాగచైతన్య ఫుల్ ఫ్రీ. అతడికి మరో కమిట్ మెంట్ లేదు. మరీ ముఖ్యంగా చైతూకు ఎలాంటి ఇమేజ్ లేదు. కానీ ఇప్పుడు టాలీవుడ్ బిజీ హీరోల్లో ఒకడు నాగచైతన్య. చేతిలో 2-3 సినిమాలున్నాయి. ఇలాంటి టైమ్ లో ఈ సీక్వెల్ కోసం అతడ్ని ఒప్పించడం ఈజీ అవ్వొచ్చేమో కానీ, వీలైనంత త్వరగా కాల్షీట్లు పట్టడం మాత్రం అంత ఈజీ కాదు.

"ఏ మాయ చేసావె"  సినిమాను తెలుగు-తమిళ భాషల్లో వేర్వేరు హీరోహీరోయిన్లతో ఒకేసారి తీశాడు గౌతమ్ మీనన్. తెలుగులో చైతూ-సామ్ నటిస్తే.. తమిళ్ లో శింబు-త్రిష నటించారు. ఈసారి అలా రెండు భాషల్లో ఈ ఇద్దరు హీరోలతో సైమల్టేనియస్ గా సినిమా చేయడం గౌతమ్ మీనన్ వల్ల కాకపోవచ్చు. ఈ దర్శకుడు మాత్రం సీక్వెల్ కోసం చాలా కష్టపడి కథ రాస్తున్నట్టు ప్రకటించేశాడు.

ఇవన్నీ పక్కనపెడితే.. "ఏ మాయ చేసావె" సినిమా ఓ మ్యాజిక్. అప్పట్లో అన్నీ అలా సింక్ అయ్యాయి. ఆ మేజిక్ ను పదేళ్ల తర్వాత మళ్లీ రిపీట్ చేయడం దాదాపు అసాధ్యం. ఇటీవల శింబు -త్రిషతో అవే  పాత్రలతో లక్డౌన్ లో ఒక షార్ట్ ఫిలిం తీశాడు. దానికి మంచి వ్యూస్ వచ్చాయి. కానీ విమర్శలు కూడా అంతే రేంజ్ లో వచ్చాయి.