చిరంజీవి టాలీవుడ్ పెదరాయుడు కాగలరా?

Will Chiru replace Dasari's positio?
Friday, January 3, 2020 - 18:45

దాసరి నారాయణరావు లేని లోటు ఏమిటో తెలుగు సినిమావాళ్ళకి తరచూ తెలిసి వస్తోంది. చిత్ర పరిశ్రమలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ‘గురువు గారు’ దగ్గరకి వెళ్దాం అనుకొనేవారు. స్టార్స్ నుంచి జూనియర్ ఆర్టిస్టుల వరకూ... నిర్మాతల నుంచి కార్మికుల వరకూ 24 క్రాఫ్ట్స్ లో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా, ఏ వివాదం నెలకొన్నా దాసరి ఇల్లు ఓ కోర్టుగా మారేది. అక్కడి పెదరాయుడు ఆయనే.

ఇప్పుడు తెలుగు సినిమావాళ్ళ మధ్య ఏ చిన్నపాటి తగువు వచ్చినా అది చిరిగి చేటంత అయి పేట అంతా తెలుస్తోంది. దాసరిలా సర్దుబాటు చేసే పెద్ద మనిషి లేకుండాపోయారు. 

తెలుగు సినిమావాళ్ళకి దాసరి నారాయణరావులా చిరంజీవి పెద్ద దిక్కుగా మారతారు అని అందరూ భావించారు. చిరు కూడా టాలీవుడ్ పెదరాయుడు గుర్తింపును ఆశిస్తున్నారు. మా డైరీ ఆవిష్కరణలో కూడా తన పెద్దరికాన్ని చూపించారు. రాజశేఖర్ ఆవేశంగా మాట్లాడి ఇక్కడ సమస్యలు ఉన్నాయి అని కామెంట్స్ చేసినప్పుడు ‘నేను చెప్పిన మాటకు ఎవరూ విలువ ఇవ్వలేదు. మా మాటలకు గౌరవం ఇవ్వనప్పుడు మేమంతా ఇక్కడ ఎందుకు ఉండాలి..’ చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఆ తరవాత జీవిత వచ్చి రాజశేఖర్ తరఫున సారీ చెప్పారు. మొత్తానికి చిరు పెద్దరికం కనబరిచినా – దాసరి తరహాలో అన్ని విభాగాలకు, అన్ని వర్గాలకు దగ్గర కాగలరా అనే చర్చ మొదలైంది.

గతంలో ఏదైనా సమస్య వస్తే దాసరి నారాయణ రావుని కలవడం చాలా సులభంగా ఉండేది. ఎవరికైనా ఆయన ఇంటికి వెళ్ళడంలో హోదా, స్థాయి లాంటి ఆటంకాలు ఉండేవి కావు. జూనియర్ ఆర్టిసుల సంఘం వాళ్ళైనా, లైట్ బాయ్స్ అయిన సరే గురువు గారు అంటూ వెళ్ళి సమస్య చెప్పుకోగలిగేవారు. దర్శకులు-నిర్మాతలు, నిర్మాతలు-హీరోలు... ఎవరి మధ్య వివాదం వచ్చినా ఎంతటివారినైనా పిలిచి మాట్లాడేవారు. ఇండస్ట్రిలో ఏ మూల ఏం జరుగుతోందో దాసరికి పక్కాగా, ఎప్పటికప్పుడు సమాచారం చేరేది. అంతగా ఆయనకు నెట్ వర్క్ ఉండేది. అయితే చిరంజీవి దగ్గరకు వెళ్ళడం అంతా సులభం కాదు. సమస్య చెప్పుకోవడానికి చాలా గేట్లు దాటాల్సి ఉంటుంది... చాలా మందితో చెప్పించుకొంటే కానీ ఆయన దర్శనం దొరకదు.

అలాగే కింది స్థాయివాళ్ళు, చిన్న స్థాయి వాళ్ళ సమస్యలు అర్థం చేసుకోగలరా? అలాగే ఇండస్ట్రిలో దాసరి స్థాయిలో నెట్ వర్క్ ను విస్తరించుకోలేదు అనేది వాస్తవం. చిరంజీవి అంటే గీతా కాంపౌండ్ వాళ్ళకు మొగ్గు చూపుతారు అనే నిశ్చితాభిప్రాయంలో సినీ జనం ఉన్నారు. దాన్ని చెరుపుకోవాలి. ఇప్పుడు చిరు కొత్త మిత్రుడుగా మోహన్ బాబు కనిపిస్తున్నారు. చిరు పెదరాయుడుగా నిర్వహించే సినీ పంచాయతీల్లో మోహన్ బాబు కూడా తలదూరిస్తే సమస్య చల్లారకపోగా అది మరింత పెరుగుతుంది అని సినిమావాళ్లు చెవులుకొరుక్కొంటున్నారు. దాసరి అయితే మోహన్ బాబు లాంటివాళ్ళని ఒక్క మాటతో అదుపు చేయగలిగేవారు. చిరుకు అలాంటి అజమాయిషీ వస్తుందా? ఏమో కాలమే చెప్పాలి.