ఆలియాతో రాజమౌళికి టెన్షనే!

Will negative trolling on Alia affect RRR?
Tuesday, July 14, 2020 - 14:00

ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందనేది పాత సామెత. దీన్ని ఇప్పుడు కాస్త మార్చుకుంటే.. సుశాంత్ సింగ్ మరణం ఆలియాభట్ చావుకొచ్చిందని చెప్పుకోవచ్చు. అవును.. సుశాంత్ ఆత్మహత్యతో ఊహించని విధంగా ఆ సెగ ఆలియాభట్ కు తగిలింది. నెపొటిజం అంటూ ఆమెపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోందక్కడ.

అంతెందుకు, ఆమె చెల్లెలుని కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. "నన్ను రేప్ చేస్తామని, చంపేస్తామని బెదిరిస్తున్నారు", అంటూ అలియా చెల్లెలు నిన్న తమ పరిస్థితి ఎలా అయిందో తెలియచేసింది.

రాబోయే ఆలియా సినిమాలపై ఈ వ్యతిరేకత ఎంత ప్రభావం చూపించబోతోందనేది ఇప్పుడే చెప్పలేం. ఆమె నటించిన ఏదో ఒక సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఆ ఎఫెక్ట్ అందరికీ తెలిసొస్తుంది. మరీ ముఖ్యంగా సదరు సినిమా ప్రమోషన్ లో నెపొటిజంపై ఆలియా స్పందించే విధానం బట్టి మూవీ రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. సరిగ్గా ఇక్కడే "ఆర్ఆర్ఆర్" పేరు కూడా తెరపైకొస్తోంది.

నెపొటిజంపై భారీ ఎత్తున బాలీవుడ్ లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. ఆలియా నటిస్తున్న "ఆర్ఆర్ఆర్" సినిమాను బాలీవుడ్ జనాలు ఏ రేంజ్ లో రిసీవ్ చేసుకుంటారనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది.

ఇప్పటికే ఆలియాతో చాలా తలనొప్పులు పడుతున్నాడు రాజమౌళి. ప్రారంభంలో ఆమె కాల్షీట్లు ఇతడికి దొరకలేదు. ఆ తర్వాత లాక్ డౌన్ వచ్చి పడింది. ఇప్పుడు మళ్లీ ఎప్పటికి కాల్షీట్లు ఇస్తుందో అనే టెన్షన్ జక్కన్నలో ఉండనే ఉంది. వీటికి తోడు భవిష్యత్తులో రాజమౌళికి ఎదురుకాబోయే పెద్ద తలనొప్పుల్లో ఆలియా నుంచి ఈ టెన్షన్ కూడా ఒకటి సిద్ధంగా ఉంది.