ఇరకాటంలో రష్మిక

Will Rashmika be part of Kirik Party 2
Saturday, February 29, 2020 - 18:45

కేవలం మాజీ ప్రియుడు మాత్రమే కాదు, రక్షిత్-రష్మిక వ్యవహారం పెళ్లిపీటల వరకు వెళ్లింది. ఎంగేజ్ మెంట్ కూడా పూర్తయిన తర్వాత విడిపోయారు వీళ్లిద్దరూ. అలా విడిపోయిన ఇన్నాళ్లకు వీళ్లిద్దరూ కలవబోతున్నారంటూ కన్నడ మీడియా ఓ రేంజ్ లో ప్రచారం చేస్తోంది. దీనికి కారణం రక్షిత్ శెట్టి పెట్టిన ఓ ట్వీట్.

"కిరాక్ పార్టీ 2 పై మొన్నటివరకు నాకు ఎలాంటి ప్లాన్స్ లేవు. కానీ ఇప్పుడు పెర్ ఫెక్ట్ ప్లాట్ దొరికింది. కిరాక్ పార్టీ మళ్లీ తెరపైకి రాబోతోంది. ఇదొక మంచి ఫైట్ కాబోతోంది."

కిరాక్ పార్టీలో రష్మిక పెర్ఫార్మెన్స్ ను ఎవ్వరూ మరిచిపోలేరు. ఆమెకు ఫుల్ పాపులారిటీ తెచ్చిపెట్టిన సినిమానే ఇది. ఇంకా చెప్పాలంటే రష్మిక పెర్ఫార్మెన్స్ వల్ల ఆ సినిమా ఓ రేంజ్ లో ఆడింది. అలాంటి సినిమాకు సీక్వెల్ అంటే కచ్చితంగా అందరి దృష్టి మరోసారి రష్మికపై పడుతుంది. కన్నడ మీడియా ఇప్పుడు అదే పని చేస్తోంది.

కిరాక్ పార్టీ 2 కోసం రక్షిత్-రష్మిక మరోసారి కలుస్తారంటూ ఆ మీడియా కోడై కూస్తోంది. రక్షిత్ తో ప్రస్తుతం తనకు ఎలాంటి అభిప్రాయబేధాల్లేవంటూ సరిలేరు నీకెవ్వరు ప్రమోషన్ టైమ్ లో రష్మిక ప్రకటించడం కూడా ఈ కథనాలకు మరింత తావిస్తోంది.

అయితే కిరాక్ పార్టీ సీక్వెల్ ను రక్షిత్ ప్రకటించినప్పటికీ.. రష్మిక అందులో నటిస్తుందా లేదా అనేది అనుమానమే. వ్యక్తిగత విషయాల్ని పక్కనపెడితే.. ప్రొఫెషనల్ గా రష్మిక ఇప్పుడు ఫుల్ బిజీ. తెలుగులో బన్నీ సినిమా ఉంది. తమిళ్ లో కూడా ఓ సినిమా చేస్తోంది. ఇలాంటి టైమ్ లో తనకు పేరు తెచ్చిపెట్టిన కిరాక్ పార్టీ సీక్వెల్ కు ఆమె కాల్షీట్లు కేటాయిస్తుందా అనేది డౌట్.