రష్మిక ఆ పని చేస్తుందా?

Will Rashmika learn that dialect?
Friday, April 17, 2020 - 18:30

ఛలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రష్మిక. ఆ సినిమాలో కార్తీక అనే అమ్మాయిగా నటించింది. విషయం ఏంటంటే.. ఆంధ్రా-తెలంగాణ బోర్డర్ లో జరిగిన ఆ కథలో తమిళ కుటుంబానికి చెందిన అమ్మాయిగా నటించిన రష్మిక.. లెక్కప్రకారం అందులో తమిళ్ లో లేదంటే చిత్తూరు యాసలో మాట్లాడాలి. కానీ మొదటి సినిమాకు అలాంటి ప్రయోగాలేం చేయలేదు. రష్మిక చుట్టూ ఉన్నవాళ్లంతా చిత్తూరు యాసలో మాట్లాడతారు కానీ రష్మిక మాత్రం నార్మల్ తెలుగులోనే మాట్లాడుతుంది. అయితే ఈసారి మాత్రం రష్మికకు తప్పించుకునే అవకాశం లేదు.

పుష్ప సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది రష్మిక. లాక్ డౌన్ పూర్తయిన వెంటనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లాలి. ఇందులో ఆమె పూర్తిగా చిత్తూరు జిల్లా రూరల్ ప్రాంతానికి చెందిన అమ్మాయిగా కనిపించనుంది. అంటే.. తప్పనిసరిగా చిత్తూరు యాసలోనే మాట్లాడాలన్నమాట.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి బన్నీ చిత్తూరు యాస నేర్చుకుంటున్నాడు. డీజే సినిమా కోసం బ్రాహ్మణుల వద్ద మాటతీరు, వ్యవహారికం నేర్చుకున్న బన్నీ.. ఇప్పుడు తనకు తెలిసిన తమిళ ఫ్రెండ్స్ దగ్గర తమిళ యాస నేర్చుకుంటున్నాడు. అటు రష్మిక కూడా ఈ లాక్ డౌన్ టైమ్ లో తమిళ యాసను ఫుల్ గా ప్రాక్టీస్ చేస్తోంది. సో.. ఈ లాక్ డౌన్ టైమ్ రష్మికకు అలా కలిసొచ్చిందన్నమాట. ఈసారి ఆమె చిత్తూరు యాసలో మాట్లాడడం గ్యారెంటీ.