ఫోర్స్ చేస్తే ఫ్లాప్ ఇచ్చా: యండమూరి

Yandamuri Veerandranath recalls Stuartpuram's flop
Wednesday, May 27, 2020 - 16:45

మెగాస్టార్ చిరంజీవి 1990 చివర్లో చాలా ఇబ్బంది పడ్డారు. దానికి కారణం జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా ఇచ్చిన పెద్ద విజయం ఒకటైతే.. హిందీలో చేసిన ప్రతిబంధ్ పెద్ద హిట్టవ్వడం మరొకటి. దీంతో సౌత్-నార్త్ కు కనెక్ట్ అయ్యేలా చేయాలనుకున్న రాజావిక్రమార్క బెడిసికొట్టింది. సరిగ్గా అదే టైమ్ లో చిరు కెరీర్ లో మరో ఫ్లాప్ సినిమా వచ్చి పడింది. దాని పేరు స్టువర్టుపురం పోలీస్ స్టేషన్.

చిరంజీవి, యండమూరి, కేఎస్ రామారావు, ఇళయరాజా లాంటి ఉద్దండులు కలిసి చేసిన ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఆనాటి అనుభవాల్ని మరోసారి గుర్తుచేసుకున్నారు రచయిత యండమూరి వీరేంద్రనాథ్. చిరంజీవికి డిజాస్టర్ ఇచ్చాననే బాధ తనకు ఇప్పటికీ ఉందంటున్నారాయన. అంతేకాదు.. తనను డైరక్ట్ చేయమని చిరంజీవి బలవంతం పెట్టడంతోనే సమస్యంతా వచ్చిందంటున్నారు.

"స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ ఫెయిల్యూర్ కు చాలా కారణాలున్నాయి. ముందుగా చెప్పాలంటే సినిమాల్లో సాంగ్స్ అనేవి నాకు నచ్చవు. అర్థసత్య టైపులో సినిమా తీయాలనుకున్నాను. ఫస్ట్ డే షూటింగ్ అయిన రోజే నేను బరస్ట్ అయ్యాను. నేను, చిరంజీవి, అల్లు అరవింద్, కేఎస్ రామారావు అంతా ఉన్నప్పుడు నేను దర్శకత్వం వహించనని చెప్పేశాను. అప్పుడు చిరంజీవి, అరవింద్ నాకు ధైర్యం చెప్పి కొనసాగించారు."

స్టూవర్టుపురం  పోలీస్ స్టేషన్ సినిమాపై రిలీజ్ కు ముందు నుంచి తనకు ఏమాత్రం నమ్మకం లేదని చెప్పారు యండమూరి. పాటలు పెట్టడంతో పాటు హీరోయిన్ల ఎంపిక కూడా తనకు నచ్చలేదన్నారు. దీనికితోడు క్లైమాక్స్ వీక్ అన్నారు.

"సగం మనసుపెట్టి ఆ సినిమా చేశాను. సినిమాలో క్లైమాక్స్ చాలా వీక్. నిరోషా కూడా మైనస్ పాయింట్. విజయశాంతి కూడా ఆ పాత్రకు సూట్ కాలేదు. అందుకే స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ డిజాస్టర్ అయింది. నావల్ల నిర్మాత చాలా నష్టపోయాడు. చివరికి ఇళయరాజా సంగీతం కూడా కాపాడలేకపోయింది."

అయితే ఈ డిజాస్టర్ తర్వాత చిరంజీవి చాలా జాగ్రత్తపడ్డారు. ఆ జాగ్రత్త నుంచి వచ్చినవే గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, ఘరానామొగుడు సినిమాలు. బ్యాక్ టు బ్యాక్ వచ్చిన ఈ సినిమాను చిరంజీవి కెరీర్ ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లాయి