నాని ముందుకెళ్తాడా? వెనక్కి వెళ్తాడా?

నాని సక్సెస్ గ్రాఫ్ ఇపుడు మామూలుగా లేదు. సౌత్ ఇండియాలో నాని రేంజ్లో వరుస హిట్స్ ఇస్తున్న హీరో మరొకరు లేరు. టాక్‌తో సంబంధం లేదు, రేటింగ్‌లతో ముడిపెట్టేది లేదు. నానికి మేం మినిమం హిట్ ఇస్తామని తెలుగు ప్రేక్షకులు తీర్మానించుకున్నట్లు కనిపిస్తోంది. ఈ ఊపులోనే నాని మరో సినిమాకి రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు.
"కృష్ణార్జున యుద్ధం" సినిమాని ఏప్రిల్12న విడుదల చేస్తామని నాని నిర్మాతలు రీసెంట్గా గ్రాండ్‌గా ప్రకటించారు. అప్పటికి రజనీకాంత్ సినిమాకి రిలీజ్ డేట్ ఫిక్స్ కాలేదు.
నాని డేట్ చెప్పిన రెండు రోజులకే రజనీకాంత్ తన "2.0" సినిమా ఏప్రిల్ 14న విడుదల అవుతుందని అనౌన్స్ చేశాడు. అంటే నాని మూవీ రజనీ మూవీతో డైరక్ట్‌గా పోటీ పడాలి. కానీ నాని అంత ధైర్యం చేయగలడా? హలో వంటి సినిమాలతో పోటీ పడడం వేరు రజనీ సినిమాతో ఢీ కొనడం వేరు. ఆ విషయం నానికి తెలుసు. ఎట్టి పరిస్థితుల్లోనూ టూ పాయింట్ జీరోకి పోటీగా తన సినిమాని రిలీజ్ చేయడు. మరి అతనికి కొత్త డేట్ ఎపుడు దొరికేనూ? నాని తన సినిమాని రెండు వారాలు ముందుకు జరుపుతాడా? లేక రెండు వారాలు వెనక్కి వెళ్తాడా?
ముందుకి వెళ్తే నుయ్యి వెనక్కి వెళ్లే గొయ్యి అనే సామెతకి తగ్గ ఉంది పరిస్థితి. ఎందుకంటే మార్చి 29న చరణ్ నటిస్తున్న రంగస్థలం విడుదల కానుంది. చరణ్ సినిమాకి, రజనీ సినిమాకి మధ్య రెండు వారాల గ్యాప్ ఉంది. సో చరణ్ మూవీకి సమస్య లేదు. ఏప్రిల్ 27న బన్ని నటిస్తున్న నా పేరు సూర్య, మహేష్‌బాబు నటిస్తున్న భరత్ అనే నేను రానున్నాయి. ప్రస్తుతానికి ఈ రెండు చిత్రాలు ఒకేరోజు పోటీపడే అవకాశం ఉందని కనిపిస్తున్నా..రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే ఆ డేట్‌కి వస్తుంది. మరోటి వాయిదా పడుతుంది.
ఈ లెక్కన...నాని సినిమా ఎపుడు విడుదల అవుతుంది? ధైర్యం చేసి నాని చరణ్, బన్ని, మహేష్ మూవీస్‌తో పోటీపడుతాడా? లేదా నింపాదిగా మే మిడిల్లో రిలీజ్ చేస్తాడా?
- Log in to post comments