బాహుబలి ఫార్ములా మొదలైంది

పైసా ఖర్చు లేకుండా బీభత్సంగా ప్రచారం సంపాదించడం రాజమౌళికి మాత్రమే తెలుసు. బాహుబలితో ఈ విషయం అందరికీ తెలిసొచ్చింది. సరిగ్గా ఇప్పుడు అదే ఫార్ములాను తన నెక్ట్స్ మూవీకి కూడా అప్లయ్ చేస్తున్నాడు ఈ దర్శకుడు. ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా చేస్తున్న మల్టీస్టారర్ సినిమాకు...రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టిన తొలి రోజు నుంచే అఫీషియల్ గా ప్రచారం స్టార్ట్ చేశాడు జక్కన్న.
ఈ సినిమా ఓపెనింగ్ నుంచే మీడియాను దూరంపెట్టిన రాజమౌళి, నవంబర్ 19 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశాడు. తొలి షాట్ ను ఎన్టీఆర్-చరణ్ పై తీశాడు. వీళ్లతో తను దిగిన ఫొటోతో పాటు.. ఫస్ట్ షాట్ మేకింగ్ వీడియోను బయటకు వదిలాడు. అలా ఈ మల్టీస్టారర్ కు అధికారికంగా ప్రచారం స్టార్ట్ చేశాడు రాజమౌళి.
గతంలో బాహుబలి విషయంలో కూడా ఇలానే చేశాడు ఈ డైరక్టర్. సినిమాలో కొన్ని సన్నివేశాల్ని కర్నూలు సమీపంలో షూట్ చేశారు. ఆ ఫొటోస్ తోనే ప్రచారం స్టార్ట్ చేశాడు. అలా రెండేళ్ల వరకు సినిమాను లైమ్ లైట్లో ఉంచాడు. ఇప్పుడు ఆర్-ఆర్-ఆర్ మూవీ ప్రచారాన్ని కూడా తన భుజాలపై వేసుకున్నాడు.
తను ఏం చెప్పినా, ఏది రిలీజ్ చేసినా దానికి మీడియా ఫుల్ హైప్ ఇస్తుందనే విషయం రాజమౌళికి తెలుసు. అందుకే అతడు మీడియాను లెక్కచేయడం లేదు. మరీముఖ్యంగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా కంటే సోషల్ మీడియాను నమ్ముకోవడం బెటరని ఈ దర్శకుడు ఎప్పుడో ఫిక్స్ అయ్యాడు.
- Log in to post comments