చిరంజీవి అంటే పిచ్చి

Aamani says she loves Chiranjeevi madly
Sunday, November 24, 2019 - 23:00

ఒకప్పుడు చిరంజీవి అంటే ఒక శకం. ఇప్పుడంటే పవన్, మహేష్ లాంటి హీరోలు వచ్చారు కానీ, అప్పట్లో అంతా చిరంజీవి మేనియాలో ఊగిపోయేవారు. అందులో సామాన్య ప్రేక్షకులే కాదు.. హీరోహీరోయిన్లు కూడా ఉండేవారు. తాజాగా నటి ఆమని తన మనసులో మాట బయటపెట్టింది. చిరంజీవి అంటే తనకు పిచ్చి అంటోంది ఈ మాజీ హీరోయిన్.

"నా స్కూల్ డేస్ నుంచి నేను చిరంజీవి ఫ్యాన్. నేను చదివే రోజుల్లో చిరంజీవి పోస్టర్లు, ఫొటోల్ని కట్ చేసి ఆల్బమ్ గా తయారుచేశాను. మా అమ్మ తిడుతుందని కనిపించకుండా దాచేదాన్ని. మా తమ్ముడికి డబ్బులిచ్చి ఆ ఫొటోలు తెప్పించుకొని, కట్ చేసి, ఆల్బమ్ తయారుచేశాను. రోజూ ఆ ఆల్బమ్ చూసుకునేదాన్ని. అంత పిచ్చి చిరంజీవి అంటే."

తెలుగులో దాదాపు 30 సినిమాలు చేసిన ఆమని, చిరంజీవి సరసన మాత్రం నటించలేకపోయింది. ఒక టైమ్ లో మెగాస్టార్ సరసన నటించే ఛాన్స్ వచ్చినప్పటికీ, కొన్ని కారణాల వల్ల మిస్ అయిందని, ఆ సినిమా చేసుంటే తనకంటే అదృష్టవంతురాలు ఎవరూ ఉండేవారు కారని అంటోంది.

ఇప్పటికీ చిరంజీవిని తన మనసులో మూగగా ఆరాధిస్తుంటానని చెప్పిన ఆమని, ఆ విషయాన్ని మాత్రం చిరంజీవికి చెప్పలేదంటోంది. చాలాసార్లు చిరంజీవిని కలిశానని, కానీ తన మనసులో మాట మాత్రం చిరంజీవికి ఎప్పుడూ చెప్పలేదంటోంది. ఈసారి మాత్రం మెగాస్టార్ ను కలిస్తే తప్పకుండా తన ఇష్టాన్ని చెప్పేస్తానని కూడా అంటోంది.