న‌టుడు వైజాగ్ ప్ర‌సాద్ క‌న్నుమూత‌

Actor Vizag Prasad passes away
Sunday, October 21, 2018 - 12:30

తండ్రి పాత్ర‌ల‌కి పేరొందిన ప్ర‌ముఖ‌ నటుడు వైజాగ్ ప్రసాద్ క‌న్నుమూశారు. ఆదివారం (అక్టోబ‌ర్ 21) తెల్లవారు జామున 3 గంటలకు గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. ఒక కొడుకు, కూతురు ఉన్నారు. వారు అమెరికాలో ఉంటున్నారు. తేజ తీసిన నువ్వు నేను సినిమాలో హీరోయిన్ తండ్రి పాత్ర పోషించి బాగా పాపుల‌ర్ అయ్యారు. ఆ త‌ర్వాత అలాంటి అనేక పాత్ర‌ల‌కి కేరాఫ్‌గా నిలిచారు చాలాకాలం. 

గత రెండేళ్లుగా అనారోగ్య సమస్యలు వల్ల ఇంటికే పరిమితం అయ్యారు. యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయ‌న అసలు పేరు కొర్లాం పార్వతీ వర ప్రసాదరావు. సొంతూరు విశాఖపట్నం దగ్గర గోపాలపట్నం. వైజాగ్‌ నుంచి వచ్చాను కాబట్టి   ఇండ‌స్ట్రీలో వైజాగ్ ప్రసాద్‌గా పేరు స్థిరపడిపోయింది. ఉద్యోగం చేస్తూ నాట‌కాలు వేసేవారు. జంధ్యాల తీసిన  ‘బాబాయ్‌ అబ్బాయ్‌’ ఆయ‌న‌ మొదటిసినిమా. ఆ తరవాత ‘మొగుడూ పెళ్లాలు’, ఉషాకిరణ్‌ మూవీస్‌వారి ‘ప్రతిఘటన’ సినిమాల్లో చేశారు. ఐతే ఆయ‌న‌ని పాపుల‌ర్ చేసిన మూవీ..నువ్వు నేను. ఆ సినిమా సూప‌ర్‌డూప‌ర్ హిట్ కావ‌డంతో ఆయ‌న త‌న ఉద్యోగానికి రాజీనామా చేసి న‌టుడిగా బిజీ అయిపోయారు. 

జూనియ‌ర్స్‌, నిన్ను చూడ‌క నేనుండ‌లేను, ఇదీ మా అశోగ్గాడి ల‌వ్‌స్టోరీ, గౌరి, జాన‌కీ వెడ్స్ శ్రీరామ్‌...ఇలా ఆనాటి యువ హీరోల సినిమాల్లో తండ్రిగా, విల‌న్‌గా, క్యార‌క్ట‌ర్ ఆర్టిస్ట్‌గా క‌నిపించారు. రీసెంట్‌గా బాల‌య్య న‌టించిన ల‌య‌న్ సినిమాలో ఒక పాత్ర పోషించారు.