పార్టీలతో అలీ దోబూచలాట

కమెడియన్ అలీ ఈ సారి ఏపీ ఎన్నికల బరిలో దిగాలనుకుంటున్నాడు. తన సొంత పట్టణమైన రాజమండ్రి నుంచి కానీ, గుంటూరు నుంచి కానీ బరిలోకి దిగాలనేది ఆయన డ్రీమ్. గుంటూరు సీటుని ముస్లింలు అధికంగా ఉన్నారనే కారణంతో అడుగుతున్నాడు. మొన్న వైఎస్సార్సీ అధినేత జగన్‌ని కలిసి అందర్నీ సర్‌ప్రైజ్ చేశాడు. ఇపుడు తెలుగుదేశం పార్టీ మంత్రి గంటాని కలిసి మళ్లీ ఆశ్చర్యపరిచాడు. ఇంతకీ ఏ పార్టీలో చేరనున్నాడు? ఏ విషయమైనా సంక్రాంతి తర్వాత అంటే జనవరి 16న ప్రకటిస్తానని అంటున్నాడు అలీ.
మొదట జనసేన తరఫున పోటీలో దిగుతాడని అంతా భావించారు. ఎందుకంటే జనసేన పార్టీ పెట్టినపుడు అలీ పవన్ కల్యాణ్‌కి తోడుగా ఉన్నాడు. పవన్ కల్యాణ్ కార్యాలయం ప్రారంభ సమయంలో సర్వమత ప్రార్థనల్లో భాగంగా అలీ ఖురాన్ చదివి వినిపించాడు. పైగా పవన్‌కి సినిమా ఇండస్ట్రీలో మంచి దోస్త్.
జనసేన కన్నా ముందు నుంచి అతను తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. కార్యకర్తగా పనిచేశాడు. ఐతే పవన్ కల్యాణ్ పార్టీ పెట్టగానే టీడీపికి దూరమై జనసేన వైపు వచ్చాడు. సడెన్‌గా జనసేన నుంచి దూరం జరిగి జగన్‌ని కలిశాడు. ఐతే జగన్ అలీకి రాజమండ్రి సీటు ఇచ్చేందుకు అంగీకరించలేదట. దాంతో ఇపుడు గంటాని కలిశాడు. మంత్రి గంటా మీడియాతో మాట్లాడుతూ.. అలీ డిమాండ్స్, ఆయన ఆశలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తెలుపుతాననీ, పాజిటివ్ వార్తే ఉంటుందని చెప్పాడు.
తనకి కావాల్సిన సీట్ దక్కించుకునేందుకు ఇలా అన్ని పార్టీలను కలిశాడు. ఫైనల్‌గా అతను ఏం అనౌన్స్ చేస్తాడో చూడాలంటే 16 వరకు ఆగాలి.
- Log in to post comments