అందరి కళ్లు ఆ ఇద్దరి పైనే!

All eyes on Rajinikanth and Salman Khan
Monday, June 19, 2017 - 18:00

'బాహుబలి 2' సినిమా రికార్డుల మీద రికార్డులు సృష్టించింది. ఇక ప్రపంచవ్యాప్త వసూళ్లలో 'దంగల్' సినిమా నంబర్ వన్ ఇండియన్ మూవీగా నిలిచింది. ఈ రెండు సినిమాలు పోటీపడి మరీ వసూళ్ల వర్షం కురిపించాయి. మిగతా హీరోలకు సరికొత్త టార్గెట్స్ ఫిక్స్ చేశాయి. అయితే ఈ రెండు సినిమాలు సాధించిన రికార్డుల్ని క్రాస్ చేయాలంటే అది కొంతమంది హీరోలకు మాత్రమే సాధ్యం. అందుకే ప్రస్తుతం అందరి చూపు సల్మాన్ ఖాన్, రజనీకాంత్ పైనే పడింది.

'దంగల్', 'బాహుబలి 2' రికార్డుల్ని క్రాస్ చేసే సత్తా రజనీకాంత్ కు మాత్రమే ఉందని చాలామంది భావిస్తున్నారు. దీనికి తోడు ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తో కలిసి దూసుకొస్తున్నాడు రజనీకాంత్. శంకర్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న '2.0' సినిమాలో రజనీ హీరో అయితే, అక్షయ్ విలన్. వీళ్లిద్దరూ కలిసి సరికొత్త బాక్సాఫీస్ రికార్డులు సృష్టిస్తారని అంతా ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.

'దంగల్' సినిమా చైనాలో దుమ్ముదులిపింది. 2.0 సినిమా చైనాలో ఆ రేంజ్ లో ఆడుతుందో లేదో చెప్పలేం. కానీ రజనీకాంత్ కు జపాన్, జర్మనీ, బ్రెజిల్ లాంటి దేశాల్లో మంచి మార్కెట్ ఉంది. సో.. దంగల్ రికార్డుల్ని కొల్లగొట్టాలంటే ఆ దేశాలపై ఎక్కువ దృష్టిపెడితే మంచిదని విశ్లేష‌కులు అంటున్నారు.

ఇక సల్మాన్ ఖాన్ నటించిన 'ట్యూబ్ లైట్' సినిమా విషయానికొస్తే ఈ సినిమా దంగల్, బాహుబలి-2 రికార్డుల్ని క్రాస్ చేస్తుందని ఎక్కువమంది ఆశించడం లేదు. కాకపోతే సల్మాన్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ తో పాటు, కొందరు బాలీవుడ్ జనాలు మాత్రం ట్యూబ్ లైట్ సంచలనాలు సృష్టిస్తుందని అంటున్నారు. మరి ట్యూబ్ లైట్, 2.0 సినిమాల్లో ఏది క్లిక్ అవుతుందో చూడాలి.