ఖైర‌తాబాద్ కావాలంటున్న అల్లు మామ‌!

Allu Arjun's father-in-law eyes on Khairatabad constituency!
Wednesday, July 18, 2018 - 18:45

హీరో అల్లు అర్జున్ స్నేహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. స్నేహారెడ్డి కుటుంబం అంతా రాజ‌కీయ నేప‌థ్యం ఉన్న‌వారే. స్నేహారెడ్డి తండ్రి శేఖ‌ర్ రెడ్డి ప్ర‌స్తుతం టీఆర్ ఎస్‌లో ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఇబ్ర‌హీం ప‌ట్నం అసెంబ్లీ నియోజ‌క వ‌ర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తెలుగుదేశం పార్టీకి చెందిన మంచిరెడ్డి కిష‌న్‌రెడ్డి చేతుల్లో ఓడిపోయారు ఆయ‌న‌. ఆ త‌ర్వాత మంచి రెడ్డి కిష‌న్ రెడ్డి టీఆర్ ఎస్ ఆక‌ర్ష్ ప‌థ‌కానికి ఆక‌ర్షితుడ‌యి ఆ పార్టీలో చేరారు. మ‌రోసారి ఆయ‌నే అక్క‌డ పోటీ చేయ‌నున్నారు..అదీ కూడా ఈ సారి టీఆర్ ఎస్ టికెట్‌పై. దాంతో అల్లు అర్జున్ మామ‌కి అక్క‌డ ఛాన్స్ లేదు.

సో...ఈ సారి ఆయ‌న ఖైర‌తాబాద్ సీటు మీద క‌న్నేశారు. ఖైరతాబాద్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టికెట్ ఆశిస్తున్నారు శేఖ‌ర్‌రెడ్డి. ఖైర‌తాబాద్ నియోజ‌క‌వ‌ర్గం సిటీలో ఉండ‌డం, ఇక్క‌డ బ‌న్ని పేరు త‌న‌కి క‌లిసి వ‌స్తుంద‌నే న‌మ్మ‌కంతో ఉన్నారు శేఖ‌ర్‌రెడ్డి.

టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌... శేఖ‌ర్ రెడ్డి ప్ర‌తిపాద‌న‌కి ఒప్పుకోవ‌డం అనేది డౌటే. ఎందుకంటే... ఇపుడే కాదు గ‌తంలో ఉమ్మ‌డి రాష్ట్రం ఉన్న‌పుడు కూడా ఖైర‌తాబాద్ నియోజ‌క‌వ‌ర్గం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన‌ది. ఈ సీటు నుంచి పోటీ చేసేందుకు చాలా మంది ఉబ‌లాట‌ప‌డుతున్నారు. టీఆర్ ఎస్‌లోనే ఈ సీటు కోసం గ‌ట్టి పోటీ ఉంది.