నాగ చైత‌న్య‌తో నాగ‌శౌర్య పోటీ!

August 31: Naga Chaitanya vs Naga Shourya?
Thursday, July 19, 2018 - 20:00

నాగ శౌర్య ఈ ఏడాది "ఛ‌లో" సినిమాతో మంచి విజ‌యం అందుకున్నాడు. స్వంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ పతాకంపై ఆ సినిమాని తీసి విజ‌యం అందుకున్నాడు. అదే బ్యాన‌ర్‌పై ఇంకో సినిమాని రెడీ చేస్తున్నాడు. "న‌ర్త‌న‌శాల" పేరుతో తెర‌కెక్కుతోన్న కొత్త సినిమా ప్ర‌చారం మొద‌లుపెడుతున్నాడు.

కొత్త దర్శకుడు శ్రీనివాస చక్రవర్తి దర్శకత్వం వహిస్తున్నఈ సినిమా ఫస్ట్ లుక్ శుక్రవారం (జులై 20న‌) వ‌చ్చేస్తోంది. అంటే ప్ర‌మోష‌న్ మొద‌లైంది.

ఈ సినిమాలో నాగ శౌర్య వెరైటీ పాత్ర పోషిస్తున్నాడ‌ట‌. ఇంత‌కీ ఈ సినిమాని ఎపుడు విడుదల చేయాల‌నుకుంటున్నారో తెలుసా?  ఆగస్టు 31న విడుదలకి స‌న్నాహాలు షురూ చేశారు. ఇప్ప‌టికే నైజాం ఏరియాని సునీల్ నారంగ్ ద‌క్కించుకున్నాడు.

స‌రిగ్గా అదే రోజు త‌మ సినిమా వ‌స్తుంద‌ని ఇప్ప‌టికే "శైల‌జారెడ్డి అల్లుడు" మేక‌ర్స్ ఎపుడో ప్ర‌క‌టించారు. నాగ చైత‌న్య హీరోగా మారుతి తీస్తున్న "శైల‌జ‌రారెడ్డి అల్లుడు" ఆగ‌స్ట్ 31ని త‌మ రిలీజ్ డేట్‌గా ఎపుడో క‌ర్చీఫ్ వేసింది. ఇది మీడియాలో ఇప్ప‌టికే ప్ర‌చారం కూడా జ‌రిగింది. చైత‌న్య బ‌రిలో ఉన్నాడ‌ని తెలిసి కూడా నాగ శౌర్య అదే డేట్‌పై క‌న్నేయ‌డం విశేష‌మే. మ‌రి ఆ రోజు నాగ చైత‌న్య వెర్సెస్ నాగ శౌర్య చూడ‌బోతున్నామా? రెండు నాగాస్త్రాలు ఢీకొంటాయా? వాచ్ అవుట్..