ఇక మ‌ళ్లీ షూటింగ్‌కి బాల‌య్య‌

Balakrishna's campaign ends
Wednesday, December 5, 2018 - 17:15

నాలుగు రోజులుగా తెలంగాణ ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేస్తున్న నంద‌మూరి బాల‌కృష్ణ మ‌ళ్లీ గురువారం నుంచి ఎన్టీఆర్ బ‌యోపిక్ షూటింగ్‌లో పాల్గొన‌నున్నారు. ఈ రోజు (డిసెంబ‌ర్ 5) ఎన్నిక‌ల ప్రచారం ముగిసింది. బాల‌య్య చేసిన అనేక ఎన్నిక‌ల స్పీచ్‌లు వైర‌ల్‌గా మారాయి. కేసీఆర్‌పై విరుచుకు ప‌డడం, ఆంధ్రాకి రా అని స‌వాల్ విస‌ర‌డం చ‌ర్చకి దారితీశాయి. అలాగే ఉర్దూ లాంగ్వేజ్‌లోనూ స్పీచ్‌లు ఇవ్వ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

"సారే జ‌హా సే అచ్చా" గీతాన్ని తప్పుగా పాడి ట్రాలింగ్‌కి కూడా గుర‌య్యాడు. మొత్త‌మ్మీద బాల‌య్య ప్ర‌సంగాలకి మంచి క‌వ‌రేజ్ ఐతే ద‌క్కింది. ఇవి ఫ‌లితాన్నిస్తాయా లేదా అన్న‌ది ఎన్నిక‌ల ఫలితాల నాడు తేలుతుంది.

ఇక ఎన్టీఆర్ బ‌యోపిక్ సినిమా ఆడియో ఈవెంట్‌ని డిసెంబ‌ర్ 16న తిరుప‌తిలో నిర్వ‌హించాల‌నుకుంటున్నారు. ఈ లోపు షూటింగ్‌ని పూర్తి చేయాల‌ని భావిస్తున్నాడు క్రిష్‌. ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో బాల‌య్య‌ త‌న తండ్రి పాత్ర పోషిస్తున్నాడు. తండ్రి రోల్‌ని కొడుకే న‌టించ‌డం అనేది ఒక అరుదైన గౌర‌వం. ఆ రికార్డు బాల‌య్య సొంత‌మైంది.