బ‌యోపిక్‌లో మ‌న‌వ‌డికి చోటు!?

Balakrishna's grandson Devansh to act in NTR's Biopic?
Wednesday, June 27, 2018 (All day)

ఎన్టీఆర్ బ‌యోపిక్ క్యాస్టింగ్ గురించి ఊహాగానాలు ఊపందుకున్నాయి. మ‌హేష్‌బాబు కూడా న‌టిస్తున్నాడ‌నే పుకారు కూడా వ‌చ్చింది. అది కూడా త‌న తండ్రి కృష్ణ పాత్ర‌లో మ‌హేష్ న‌టించ‌నున్నాడ‌నేది టాక్‌. ఇది నిజంగా జ‌రిగేనా? ఆ మాట ఎలా ఉన్నా....నంద‌మూరి కుటుంబ స‌భ్యుల‌ను ఏదో ఒక రూపంలో ఈ సినిమాలో ఇన్‌వాల్వ్ చేయాల‌నే ఆలోచ‌న మాత్రం బాల‌య్య‌కి ఉంది. 

ఐతే ఇందులోనూ తిర‌కాసు ఉంది. జూనియ‌ర్ ఎన్టీఆర్ అంటే బాల‌య్య‌కి ప‌డ‌దు. కాబ‌ట్టి జూనియ‌ర్‌కి ఛాన్స్ ఉండ‌దు. త‌న కుమారుడు మోక్ష‌జ్ఞ‌ని ఈ సినిమాతో ఎంట్రీ చేయించాల‌ని బాల‌య్య మొద‌ట భావించాడు. ఇపుడు ఆ ఆలోచ‌న విర‌మించుకున్నాడ‌ట‌. ఐతే మ‌న‌వ‌డు దేవాన్స్‌ని మాత్రం చూపిస్తాడ‌ట‌. త‌న తండ్రి ఎన్టీఆర్ బాల్యానికి సంబంధించిన స‌న్నివేశాల్లో మ‌న‌వ‌డు దేవాన్స్‌ని చూపించాల‌నుకుంటున్నారని టాక్‌. 

ఇక క‌ల్యాణ్‌రామ్‌, హ‌రికృష్ణ‌ల‌కి చోటు ఉంటుందా అనేది తెలియ‌దు. త‌న‌ని ఇంత‌వ‌ర‌కు అడ‌గ‌లేద‌ని ఇటీవ‌లే క‌ల్యాణ్‌రామ్ మీడియాకి తెలిపాడు. ఎన్టీఆర్ బ‌యోపిక్ వ‌చ్చే నెల 5న హైద‌రాబాద్‌లో షూటింగ్ జ‌రుపుకోనుంది. ఆరు నెలల్లో సినిమాని పూర్తి చేస్తాన‌ని ద‌ర్శ‌కుడు క్రిష్ బాల‌య్య‌కి మాటిచ్చాడు. స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క‌రామారావు ముఖ్య‌మంత్రిగా తొలిసారిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన జ‌న‌వ‌రి 9న ఈ బ‌యోపిక్‌ని విడుద‌ల చేయాల‌ని ఫిక్స్ అయ్యారు.