బిగ్ బాస్ కి బండ్ల నో ఎందుకు చెప్పాడంటే...

Bandla Ganesh says no to Bigg Boss 3
Tuesday, June 11, 2019 - 19:30

బ్లేడ్ బాబీగా పేరొందిన బండ్ల గణేష్...బిగ్ బాస్ 3లో చేరితే ఎలా ఉంటుంది? అదిరిపోద్ది కదా. ఆ ప్రోగ్రామ్...ఇలాంటి బాపతు వారికి పర్ ఫెక్ట్. అందుకే బండ్లని బిగ్ బాస్ టీమ్ సంప్రతించింది. మొదట బండ్ల గణేష్ కూడా ఉత్సాహం చూపాడు. కానీ తర్వాత తాపీగా ఆలోచించి నో చెప్పాడు.

బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత బాహ్యప్రపంచంతో సంబంధాలు కట్ అవుతాయి. ఫోన్ ఉండదు. బయటికి వచ్చే ఛాన్స్ లేదు. ఖర్మ కాలి మొదటి రౌండ్లోనే హోస్ట్ డిస్మిస్ చేస్తే తప్ప వారాల తరబడి అక్కడే ఉండాలి.

రోజుల తరబడి సెల్ ఫోన్ కి కూడా అందుబాటులో లేకుండా ఒకే ప్లేస్ లో ఉండాలంటే తన వ్యాపారాలు దెబ్బతింటాయని భయపడ్డాడు బండ్ల. ఆయనది కోళ్ల వ్యాపారం. తెలంగాణలో లీడింగ్ పౌల్ట్రీ బిజినెస్ మేన్లలో ఒకరు బండ్ల గణేష్, అంతేకాదు, మహేష్ బాబు హీరోగా రూపొందుతోన్న సరిలేరు నీకెవ్వరు చిత్రంలో ఒక కీలక పాత్రలో నటించనున్నాడు. ఆ మూవీ షూటింగ్ జులైలో ఉంటుంది. ఇన్ని కారణాల వల్ల బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వలేనని చెప్పాడట బండ్ల. బిగ్ బాస్‌లో చేయాలని ఉన్నా..ఈ కారణాల వల్ల రిజెక్ట్ చేశాడు గబ్బర్ సింగ్ నిర్మాత.

గ‌త ఏడాది చివ‌ర్లో జ‌రిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్బంగా బండ్ల గ‌ణేష్ మామూలు ర‌చ్చ చేయ‌లేదు. కేసీఆర్ శాశ్వ‌తంగా ఫామ్‌హౌస్‌లో ప‌డుకుంటాడ‌నీ, కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంద‌ని జ్యోస్యం చెప్పాడు. కాంగ్రెస్‌లో చేరి...ఎమ్మెల్యే కావాల‌ని క‌ల‌లు క‌న్నాడు కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీటు ఇవ్వ‌లేదు. కేవ‌లం అధికార ప్ర‌తినిధిని మాత్ర‌మే చేసింది. కేసీఆర్ క‌నుక మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తే సెవ‌న్ ఓ క్లాక్ బ్లేడ్‌తో కోసుకుంటాన‌ని చాలా ర‌చ్చ చేశాడు. కేసీఆర్ మ‌ళ్లీ అధికారంలోకి రాగానే బాల‌య్య ఫేమ‌స్ డైలాగ్  (స‌ర్లే ఎవేవో అనుకుంటాం అన్నీ అవుతాయా) వ‌ల్ల‌వేశాడు. అందుకే బండ్ల‌ని బిగ్‌బాస్‌లోకి తీసుకోవాల‌నుకుంది టీమ్‌. మంచి కామెడీ ఉంటుంది అని. కానీ ఛాన్స్ మిస్ అయింది జ‌నాల‌కి.