బ‌న్ని లెక్క‌లు విలువ‌ల‌పై ట్రాలింగ్‌

Bunny gets trolling over his comments
Wednesday, June 28, 2017 - 19:15

మ‌నం బావున్న‌పుడు లెక్క‌లు మాట్లాడి..క‌ష్టాల్లో ఉన్న‌పుడు విలువ‌లు మాట్లాడ‌కూడ‌దు సార్‌...

ఈ డైలాగ్‌ అల్లు అర్జున్ న‌టించిన స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి సినిమాలోనిది. ఇదే డైలాగ్‌ని కొంత మార్చి బ‌న్నికి చెపుతున్నారు ట్రాల‌ర్స్‌. "మ‌నకి రేటింగ్ బాగా వ‌చ్చిన‌పుడు రివ్యూలు మాట్లాడి.. తేడా కొట్టిన‌పుడు రెవిన్యూలు చెప్పొద్దు సార్‌.. "అంటూ బ‌న్నిని ట్యాగ్ చేస్తూ సోష‌ల్ మీడియాలో తెగ ట్రాలింగ్ చేస్తున్నారు

డీజే దువ్వాడ జ‌గ‌న్నాథం విడుద‌లైన‌ప్ప‌టి నుంచి రివ్యూలు కాదు రెవిన్యూలు కావాలి అంటూ బ‌న్ని, హ‌రీష్ శంక‌ర్ ఊద‌ర‌గొడుతున్నారు. సినిమా సూప‌ర్‌గా ఆడుతున్న‌పుడు దాన్ని ఎంజాయ్ చేయ‌కుండా రివ్యూల‌పై, క్రిటిక్స్‌పై నెగిటివ్‌గా మాట్లాడి ఇపుడు ట్రాలింగ్‌కి గుర‌వుతున్నారు.

నిజానికి బ‌న్ని న‌టించిన స‌రైనోడు, డీజే రెండూ సినిమాల‌కి మంచి రేటింగ్‌లు రాక‌పోయినా క‌లెక్ష‌న్ల ప‌రంగా అద‌రగొట్టాయి. డీజే క‌లెక్ష‌న్లు ప్ర‌స్తుతానికైతే సూప‌ర్‌గా ఉన్నాయి. అయితే ఈ రెండు సినిమాల్లోనూ నవ్య‌త లేద‌న్న‌ది కూడా అంతే వాస్త‌వం. అలాంటపుడు రివ్యూలు బాగా రావాల‌ని కోరుకోవ‌డం అత్యాశే. స‌ల్మాన్‌ఖాన్ న‌టించిన ప‌లు సినిమాల‌కి బాలీవుడ్ క్రిటిక్స్ పూర్ రేటింగ్స్ ఇచ్చారు. అయినా అవి ఆడాయి. కొన్నిసార్లు ఒక సినిమా ఎందుకు నిల‌బ‌డుతుంది అంటే ర‌క‌ర‌కాల కారణాలు చెప్పాల్సి వ‌స్తుంది. కానీ క్రిటిక్స్ మాత్రం సినిమా బాగుందా లేదా అన్న పాయింటే చూస్తారు. ఈ మర్మం తెలుసుకుంటే చాలు.